
సర్కారు భూమి స్వాధీనం
● రూ.200 కోట్ల విలువ చేసే భూమి చుట్టూ ప్రీ కాస్ట్‌వాల్ నిర్మాణం ● పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ అధికారులు
మొయినాబాద్: నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు కబ్జాకోరల నుంచి కాపాడారు. దీని చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రీకాస్ట్ వాల్‌ను జేసీబీతో కూల్చివేసి స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్ రెవెన్యూ సర్వేనెంబర్ 176లో పదెకరాల ప్రభుత్వ భూమిని నగరానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేసి ప్రీకాస్ట్ వాల్ నిర్మించాడు. కబ్జాకు గురైన స్థలం ఓఆర్‌ఆర్‌కు అతి చేరువలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ఇక్కడ ఎకరం రూ.20 కోట్ల వరకు పలుకుతోంది. ఈ లెక్కన కబ్జాకు గురైన భూమి విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మొయినాబాద్ రెవెన్యూ అధికారులు బుధవారం పోలీసులతో అక్కడికి వెళ్లారు. జేసీబీ సాయంతో ప్రీకాస్ట్ వాల్‌ను కూల్చివేస్తుండగా కబ్జాదారుడు వచ్చి అడ్డుకునేందుకు యత్నించాడు. ఓ మంత్రి పేరు చెప్పి బెదిరించాడు. అయినా రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల జోలికి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎంతటివారైనా ఉపేక్షించమన్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయిస్తున్నామని.. మొదటి విడతలో 300 ఎకరాలను గుర్తించి ఫెన్సింగ్ పనులు చేపడుతున్నామన్నారు. కూల్చివేతల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.