
కుర్మిద్దలో నెట్ జీరో సిటీ పీఎస్
● సర్వేనంబరు 311లో స్థల పరిశీలన చేసిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి
యాచారం: ఫ్యూచర్ సిటీ భద్రతా దృష్ట్యా ప్రభుత్వం నెట్ జీరో సిటీ ఠాణా ఏర్పాటు చేయతలపెట్టింది. గత బీఆర్‌ఎస్ సర్కార్ ఫార్మాసిటీ ఏర్పాటు నేపథ్యంలో మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లిలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి చర్యలు చేపట్టిన విషయం విదితమే. గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌గా ఉంటే ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కార్ రూటు మార్చింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పేరు మార్చేసి, ఇక నుంచి నెట్ జీరో సిటీగా కొనసాగించనుంది. అన్ని హంగులు, సకల సౌకర్యాలతో కూడిన నెట్ జీరో సిటీ పీఎస్‌ను నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు బుధవారం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు నెట్ జీరో సిటీ పీఎస్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు. కుర్మిద్ద సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేయతలపెట్టిన సమీపంలోని సర్వే నంబరు 311లో ఐదు నుంచి పదెకరాల్లో నూతన నెట్ జీరో సిటీ పీఎస్‌ను నిర్మించేందుకు సర్కార్ సమాలోచనలు చేస్తోంది.