
ఎన్నిక ఏదైనా.. గెలుపు బీఆర్‌ఎస్‌దే ఉండాలి
శంకర్‌పల్లి: రాష్ట్రంలో ఏఎన్నిక వచ్చినా గెలుపు బీఆర్‌ఎస్‌దే ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం శంకర్‌పల్లి మండలం జన్వాడలో మండల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సబితారెడ్డి మాట్లాడుతూ.. నాయకులెవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. నాయకులు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని, రోజు మూడు నుంచి నాలుగు గ్రామాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. యువతను పార్టీలో భాగస్వామ్యం చేయాలని, పార్టీలో కొత్త, పాత అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదని, సభలు, సమావేశాల్లో కేసీఆర్‌ని తిట్టడం తప్ప వాళ్లు ఏం లేదని ఎద్దేవా చేశారు. గతంలో వైస్.రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌లు సీఎంగా ఉన్నప్పుడు వర్షాలు సమృద్ధిగా కురిసాయని.. ఇప్పుడు వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ. 2,500 ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, చివరికి హైకోర్టు జోక్యంతో గత్యంతరం లేక, ఎన్నికలు నిర్వహించే పరిస్థితికి వచ్చిందన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ జపం చేయకుండా, ప్రజలకు ఏదైనా మేలు చేసే పనులు చేయాలని కోరారు. గ్రామాలు, పట్టణాలు ఎక్కడ తిరిగినా ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ వస్తుందని చెప్పడం సంతోషాన్ని కల్గిస్తోందన్నారు. సమావేశంలో శంకర్‌పల్లి, రాయదుర్గం పీఏసీఎస్ చైర్మన్లు శశిధర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, శంకర్‌పల్లి బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్థన్‌రెడ్డి, నాయకులు రాజు నాయక్, వెంకటేశ్, బాలకృష్ణ, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సబితారెడ్డి
జన్వాడలో శంకర్‌పల్లి ముఖ్యనాయకుల సమావేశం