
రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
నందిగామ: ఉపాధి కల్పిస్తామని తమ వద్ద కారు చౌకగా భూములు కొనుగోలు చేసి ఎలాంటి పరిశ్రమలు స్థాపించకుండా పోవడమే కాకుండా ప్రశ్నించిన తమపై కేసులు పెట్టడమేమిటని మండలంలోని చేగూరు, నర్సప్పగూడ రైతులు బుధవారం పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. చేగూరు రెవెన్యూ శివారులోని నర్సప్పగూడ గ్రామ పంచాయతీ పరిధిలో చేగూరు రోడ్డులో హైదరాబాద్ హైటెక్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి సుమారు 143 ఎకరాల భూమిని 2002, 2003లో కొనుగోలు చేశారన్నారు. అక్కడ నేటికి ఒక్క పరిశ్రమను స్థాపించలేదన్నారు. ఇదేంటని ప్రశ్నించిన తమపై కేసు నమోదు చేశారని వాపోయారు. టెక్స్‌టైల్ పార్క్ సొసైటీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు సతీష్, ఆంజనేయులు, మల్లప్ప, సాయి, రమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.