
బోరు ఏర్పాటు విషయంలో ఘర్షణ
చేవెళ్ల: తాగునీటి అవసరాల కోసం బోరు వేస్తున్న విషయంలో ఇరువర్గాలకు ఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని నాంచేరి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పరిధిలోని ఇంద్రారెడ్డినగర్ ప్రభుత్వ భూమిలో మంగళవారం ఉదయం మిషన్ భగీరథ అధికారులు బోరు వేయించేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్ అతని కుమారులు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో మాజీ సర్పంచ్ అమరేందర్‌గౌడ్ వచ్చి ఇది యూత్ భవనం కోసం కేటాయించిన స్థలంగా చెప్పి, మరో చోట బోరు వేయాలని సూచించారు. అక్కడే ఉన్న మార్కెట్ చైర్మన్ కుమారులు జైపాల్, ప్రభాకర్ గతంలో మాజీ సర్పంచ్‌తో ఉన్న మనస్పర్థల కారణంగా గొడవకు దిగారు. ఆయనపై దాడికి యత్నించారు. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారికి సర్ధి చెప్పి పంపించారు. అమరేందర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధికి ఓర్వలేకనే మాజీ సర్పంచ్ రాద్ధాంతం చేశారని మార్కెట్ చైర్మన్ పెంటయ్యగౌడ్ ఆరోపించారు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
కేశంపేట: తరుచూ ఫిట్స్ వస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని దేవునిగుడి తండాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నేనావత్ శ్రీను(28) ఫిట్స్ వ్యాధితో బాధపడేవాడు. ఇదే విషయమై పలుమార్లు మదన పడుతూ భార్య కమిలితో చెప్పేవాడు. ఆదివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య గ్రామస్తుల సహాయంతో షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
మహేశ్వరం: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం కృషి చేయాలని మంఖాల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం మహేశ్వరం గేటు వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాల కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అడవుల్లో ఉండే వన్య ప్రాణులను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో అటవీ క్షేత్ర అధికారి రాజేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు పవన్, లావణ్య, ప్రకాష్, సాయివరుణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉరేసుకొని విద్యార్థిఽని ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉమర్‌ఖాన్‌గూడలో నివాసముండే కపీంద్ర శ్యామల్ కూతురు శ్యామల్ ప్రియదర్శిని(18) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ప్రియదర్శిని అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికీ తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రియదర్శిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
వ్యాపారం కలిసిరాలేదని యువకుడి ఆత్మహత్య
పంజగుట్ట: మానసిక వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం ప్రాంతానికి చెందిన సత్తు గురవయ్య ఎల్లారెడ్డిగూడ, శాలివాహన నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడి కొడుకు అనిల్ కుమార్(27) ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదవగా..కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న డెకరేషన్ షాపు పనులు చూసుకుంటున్నాడు. అందులోనూ కలిసి రాలేదు. 13న డెకరేషన్ వస్తువులను డెలివరీ చేసేందుకు నిజామాబాద్ వెళ్లిన అనిల్ కుమార్ అర్ధరాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. సోమవారం మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతాను అని తల్లికి చెప్పి గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. రాత్రి అయినా బయటకు రాకపోవడంతో తలుపు విరగ్గొట్టి లోనికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

బోరు ఏర్పాటు విషయంలో ఘర్షణ