
సర్కార్ బడుల్లో ఏఐ తరగతులు
● జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు ● ఎన్‌ఆర్‌ఐ సహకారంతో కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు రూ.8లక్షల విలువైన కంప్యూట్లర్లు
యాచారం: విద్యార్థులు విలువలతో కూడిన విద్య ను అభ్యసించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ మౌనిక రెడ్డి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ను దత్తత తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె పాఠశాలకు రూ.8లక్షల విలువైన కంప్యూటర్లు, విద్యార్థులకు స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంతో చదువుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తరగతులను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలు ప్రభుత్వ పాఠశాలలను దతత్త తీసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల అభివృద్ధికి రూ.20 లక్షలకు పైగా వెచ్చించిన మౌనిక రెడ్డిని అభినందించారు.
ఉన్నత చదువులకయ్యే ఖర్చు భరిస్తా: మౌనిక
అనంతరం మౌనిక రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల భవిష్యత్‌కు ఎంత ఖర్చయినా వెనుకాడనన్నారు. ఇప్పటికే రూ.పది లక్షలతో పాఠశాల రూపురేఖలు మార్చామన్నారు. తాజాగా మరో రూ.10లక్షలతో డిజిటల్, ఏఐ టెక్నాలజీ ఆధారిత బోధనకు కంప్యూటర్లు అందజేశామననారు. విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని గ్రామానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకరావాలని కోరారు. పదో తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల ఉన్నత విద్యభ్యాసానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మౌనికరెడ్డి తల్లితండ్రులు రవి, కృప, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్, మండల పంచాయతీ అధికారి శ్రీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.