
ఆలయ భూములను ఆక్రమిస్తే చర్యలు
● కబ్జాకు గురైతే సమాచారం ఇవ్వండి ● దేవాదాయ శాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్
కుల్కచర్ల: ఆలయ భూములను ఆక్రమించినా, క్రయ విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని దేవాదాయ శాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమ వారం మంత్రి కొండా సురేఖ పర్యటనలో భాగంగా పాంబండ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎవరైనా దేవాలయ భూములను ఆక్రమిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అట్టి భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇటీవల కబ్జాకు గురైన తాండూరు సోమేశ్వర స్వామి ఆలయ భూమి (5 ఎకరాల 27 గుంటలు)ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 467 ఆలయాలకు 15, 779 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. అర్చకుల ఆధీనంలో 4,740 ఎకరాలు ఉండగా, 2,302 ఎకరాలు కౌలుకు ఇచ్చినట్లు చెప్పారు. కౌలు ద్వారా రూ. 60 లక్షల ఆదాయం వస్తోందన్నారు. సాగుకు యోగ్యం కాని భూములు 3,035 ఎకరాలు ఉన్నా యని, మరో 4,481 ఎకరాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు నడుస్తున్నట్లు చెప్పారు. ఆలయాల అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ప్రణీత్‌కుమార్, శాంతకుమార్, రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.