
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు
శంకర్‌పల్లి: ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరికి గా యాలైన సంఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు స్నేహితులు రావత్(25), సమేహ(25) కలిసి గురువారం ఉదయం తమ ద్విచక్రవాహనంపై ఉద్యోగ రీ త్యా మోమిన్‌పేట్ వైపు వెళ్తున్నారు. అయితే మండలంలోని లక్ష్మారెడ్డిగూడ గేట్ వద్ద వికారాబాద్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో రావత్, సమేహకి బలమైన గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రావత్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో ఆవు మృతి
షాబాద్: విద్యుదాఘాతంతో ఓ పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేసారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి రవీందర్ తన పాడి ఆవును పొలంలో మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వైర్ తగిలి షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రోజుకు 12 లీటర్ల పాలు ఇచ్చే పాడి ఆవు మృతి చెందడంతో రైతు బోరున విలపించాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికసాయం అందజేయాలని కోరారు.
రైల్వే పట్టాల పక్కన మృతదేహం లభ్యం
కొత్తూరు: రైల్వే పట్టాల పక్కన ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధి తిమ్మాపూర్ రైల్వేస్టేషన్‌సమీపంలో గురువారం వెలుగు చూసింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేష్ తెలిపిన వివరాల మేరకు.. రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన ఓ మృతదేహం పడి ఉందనే సమాచారంతో అక్కడికి చేరుకొని పరిశీలించారు. దాదాపు రెండు రోజుల క్రితం కదులుతున్న రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి కిందపడి మృతిచెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
జడ్సీ లాగిన్ ఓపెన్ చేసేందుకు యత్నం
విధుల నుంచి ఆపరేటర్ తొలగింపు
గచ్చిబౌలి: జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్‌లో సెక్షన్ రైటర్‌గా ఉన్న అభిలాష్ కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం రాత్రి అతను శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్‌లో కమిషనర్ హేమంత్ బోర్ఖాడే లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. జ డ్సీ ఫోన్‌కు ఓటీపీ వెళ్లడంతో అప్రమత్తమైన ఆయన అంతర్గత విచారణ చేపట్టగా అభిలాష్‌కు చెందిన ఐడీగా నుంచి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. అభిలాష్‌పై చర్యలు తీసుకోవాలని సిటీ ప్లానర్ శ్యామ్ కుమార్ జోనల్ కమిషనర్‌కు లేఖ రాశారు. దీంతో జోనల్ కమిషనర్ సంబంధిత ఏజెన్సీకి అతడిని సరెండర్ చేశారు. జోనల్ కమిషనర్ లాగిన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. అవినీతికి కేరాఫ్‌గా మారిన టైన్‌ప్లానింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ సిబ్బంది తరచూ అధికారుల లాగిన్‌లను వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఏసీబీ వలలో మహిళా పీఎస్ ఎస్‌ఐ
గచ్చిబౌలి: ఓ కేసులో పేరు తొలగించేందుకు డబ్బులు తీసుకుంటూ గచ్చిబౌలి ఉమెన్ పీఎస్ ఎస్‌ఐ వేణుగోపాల్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తతో పాటు అత్తింటి వారిపై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు పక్షాలను పిలిచి మాట్లాడారు. గృహహింస కేసులో తల్లి పేరును తొలగించేందుకు ఎస్‌ఐ వేణు గోపాల్ రూ.25 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు మహిళ భర్త ఏసీబీ అధికారులను అశ్రయించారు. గురువారం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ వేణుగోపాల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసిన పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ