
మీడియా స్వేచ్ఛను అడ్డుకోవద్దు
షాద్‌నగర్‌రూరల్: ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్ హాలులో టీడబ్ల్యూజేఎఫ్ తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేందర్‌గౌడ్, నరేశ్, నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజాస్వమ్యంలో మీడియా స్వేచ్ఛ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. నాటి స్వాతంత్య్ర ఉద్యమంతో పాటుగా తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో మీడియాను నాలుగో స్తంభంగా గుర్తించడంతో పాటుగా పూర్తి స్వేచ్ఛను కల్పించాయన్నారు. గత ప్రభుత్వం మీడియా విలువలకు తిలోధకాలను ఇస్తూ పాత్రికేయుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. సమాజంలో జరుగుతున్న నిజాలను రాస్తే కొందరు నాయకులు జీర్ణించుకోలేక హత్యలు, దాడులు చేయడం, కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాతికేయులు అసత్యాలను కాకుండా నిజాలను నిర్భయంగా రాయాలని, అప్పుడే వారికి సమాజం అండగా నిలబడుతుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సింలు మాట్లాడుతూ.. గతంలో పత్రికకు ఎంతో విలువ ఉండేదని, వచ్చిన వార్తలకు స్పందించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునే వారమన్నారు. ఇప్పుడు పత్రికలలో వార్తలు రాస్తే దాడులు, కేసులు, బెదిరింపులకు పాల్పడే సంస్కృతి పెరిగిందని, ఇది సరికాదని హితవు పలికారు. జర్నలిస్టులు తమ స్వేచ్ఛను సక్రమంగా వినియోగించుకోవాలని, దుర్వినియోగం చేయొద్దని సూచించారు. సమావేశంలో నేతలు రఘునాయక్, చెంది తిరుపతిరెడ్డి, కొంకళ్ల చెన్నయ్య, ఎండీ.ఇబ్రహీం, శ్రీనునాయక్, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, చెంది మహేందర్‌రెడ్డి, కక్కునూరి వెంకటేశ్‌గుప్తా, ప్రశాంత్, రాజా వరప్రసాద్, రాజు, నర్సింహ, బీసీసేన నాయకులు చంద్రశేఖరప్ప, జక్కుల జలజ, జయశ్రీకాంత్, భాగ్యలక్ష్మి, స్రవంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర ఎంతో కీలకం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్