
ఆక్రమణలను తొలగిస్తాం
తుర్కయంజాల్: ఆక్రమణలను తొలగించి మాసబ్ చెరువు నాలాను పునరుద్ధరిస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తుర్కయంజాల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇప్పుడే నాలా ఆక్రమణలు తొలగిస్తే భవిష్యత్ ఇబ్బందులు తలెత్తవన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాఽథ్ మాట్లాడుతూ.. ఇరిగేషన్, రెవెన్యూ, శాటిలైట్ మ్యాప్‌లను పరిశీలించి నాలా వెడల్పును శాసీ్త్రయంగా నిర్ధారించుకున్న తరువాత పూడీకతీత పనులను చేపడుతామన్నారు. ఇప్పటికే తుర్కయంజాల్–ఇంజాపూర్ దిలావర్‌ఖాన్ చెరువు, పెద్ద అంబర్‌పేటలోని ఈదుల చెరువు వరకు ఉన్న ఏడున్నర కిలోమీటర్ల నాలాను డ్రోన్ సాయంతో పరిశీలించామని చెప్పారు. ఈ సర్వేలో పలు చోట్ల నాలా వెడల్పు, మరికొన్ని చోట్ల లోతు తగ్గినట్లు గుర్తించామని వెల్లడించారు. మాసబ్ చెరువు నాలా పూడీకతీత పనులను ఒక మోడల్‌గా ఎంచుకుని చేపడుతామని, నివాస ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఇరిగేషన్ డీఈ చెన్నకేశవ రెడ్డి, ఏఈ వంశీ, మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి మాసబ్‌చెరువు నాలా పరిశీలన