
అధికారులపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు
నందిగామ: ప్రభుత్వం తనకిచ్చిన స్థలంలో వేసు కున్న గుడిసెను తొలగించడంతో పాటు స్థలాన్ని కబ్జా చేస్తున్న వారికి వత్తాసు పలుకుతున్న పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని మోత్కులగూడ మాజీ సర్పంచ్ వానరాసి ఎల్లమ్మ మంగళవారం మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన కాపీని విలేకరులకు అందజేశారు. తాము ఇంటి వద్ద లేని సమయంలో గ్రామానికి చెందిన జెట్ట శంకరయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తన ప్లాటులోకి ప్రవేశించి, ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోశారని తెలిపారు. విషయం తెలియడంతో తాను అక్కడికి వెళ్లగా స్థానికుల సమక్షంలోనే దూషించారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు. అనంతరం గ్రామ కార్యదర్శి చెన్నయ్య, ఎంపీడీఓ సుమతి కబ్జాదారులతో కుమ్మకై ఎలాంటి విచారణ చేపట్టకుండా, కనీసం పట్టా సర్టిఫికెట్లు కూడా పరిశీలించకుండానే తనను ప్లాటులోకి వెళ్లనీయలేదన్నారు. ఎంపీడీఓ ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శి గత నెల 27న పది మంది పోలీసులతో వచ్చి తన ప్లాటులో ఉన్న గుడిసెను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్లాటుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని, ముప్పై ఏళ్లుగా కబ్జాలో ఉన్నానని చెప్పినా కూడా వినిపించుకోలేని పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు.