
అక్రమ నిర్మాణాలపై కొరడా
మొయినాబాద్: అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారు. మున్సిపల్ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూ సర్వేనంబర్ 180లో రెండు చోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. రోడ్డు పక్కనే ఓ పౌల్ట్రీఫాంలో కొంత ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు. మరోచోట వెంచర్‌లో కొంత ప్రభుత్వ భూమిని కలుపుకొని ప్రహారీ నిర్మించారు. గోశాలకోసం ప్రతిపాదించిన సర్వేనంబర్ 180లోని 99.14 ఎకారల భూమిని ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేయడంతో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. దీంతో మంగళవారం తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఆర్‌ఐ రాజేష్, సర్వేయర్ జలజ, రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో అక్కడికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హద్దులు ఏర్పాటు చేసి బోర్డులు పాతారు. అనంతరం తహసీల్దార్ గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల జోలికొస్తే ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని అన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ అధికారులు రవీందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.