
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
మంచాల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఎ.భుజంగరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43.02 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, వారిలో 24.85 లక్షల మంది చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికీ వారికి పింఛన్ మంజూరు కాలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేయాలని, దివ్యాంగుల కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలని, ప్రతి జిల్లాకు టీసీపీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను సవరణ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రాతినిథ్యం కల్పించే విధంగా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం ఆమోదింప చేయాలన్నారు. తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికే కొనసాగుతోందని గుర్తు చేశారు. తెలంగాణలోనూ అమలు చేయాలని, దివ్యాంగుల హక్కులను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి జెర్కొని రాజు, నాయకులు బాలరాజు, మల్లయ్య, గ్యార బాష, యాదమ్మ, దశరథ, దానయ్య, అలివేలు, సత్తయ్య, పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.