
న్యాయం చేయాలని అర్ధనగ్న ప్రదర్శన
అక్రమంగా భూమిని బదలాయించారని ఆరోపణ
అబ్దుల్లాపూర్‌మెట్: కోర్టు ఉత్తర్వులు వచ్చినా తనకు న్యాయం జరగలేదని ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట హల్‌చల్ చేశారు. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేసిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. నగరంలోని సైదాబాద్‌లో నివాసముంటున్న గిరిధర్‌రెడ్డికి మండల పరిధిలోని తట్టి అన్నారంలో ఉన్న భూమి విషయంలో కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా తనకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అధికారి తనకు ఎలాంటి నోటీసులు లేకుండా భూమిని అక్రమంగా ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. తట్టిఅన్నారం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 109, 110లలో 6 ఎకరాల భూమి ఉందని, సంవత్సరాల నుంచి ఎదురు చూసినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని గిరిధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.