● గ్రాండ్ వెల్‌కమ్
చార్మినార్: మిస్ వరల్డ్–2025 పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు మంగళవారం పాతబస్తీలో సందడి చేశారు. వీరికి స్థానికులు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు. సరిగ్గా సాయంత్రం 5.10 గంటలకు తెలంగాణ టూరిజం ఏసీ బస్సుల్లో ప్రపంచ సుందరీమణులు మదీనా మీదుగా చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన రోడ వెంట ప్రజలు నిలబడి ఘన స్వాగతం పలకగా.. బస్సుల్లోంచి అభివాదం చేస్తూ వారంతా ముందుకు సాగారు. అనంతరం చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్ లో ప్రపంచ సుందరీమణులు పాల్గొన్నారు. చార్మినార్ ప్రాంగణంలో అప్పటికే ఏర్పాటు చేసిన స్టేజి పైనుంచి గ్రూప్ ఫోటో దిగిన అనంతరం చారిత్రాత్మక చార్మినార్ కట్టడం చరిత్ర, ఇతర విశేషాలను అధికారులు వారికి వివరించారు. తర్వాత కాలినడకన లాడ్ బజార్‌కు వెళ్లి అప్పటికే ఎంపిక చేసిన గాజుల షోరూంలో షాపింగ్ చేశారు. అనంతరం బస్సుల్లో చౌమహల్లా ప్యాలెస్‌కు డిన్నర్ కోసం వెళ్లారు.
● మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చార్మినార్ వద్ద తిష్ట వేశారు. భద్రతా చర్యలు, ఇతర ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులను స్వయంగా పర్యవేక్షించారు.
● చార్మినార్ నలువైపులా చిరు వ్యాపారులను అప్పటికే కట్టడి చేసిన నగర పోలీసులు పాసులున్న వారినే అనుమతించారు.
● మిస్ వరల్డ్ పోటీదారులు పాతబస్తీకి వస్తున్నారని సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున మదీనా, గుల్జార్ హౌస్ ప్రాంతాలకు చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు.
● మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా మదీనా సర్కిల్, లాడ్ బజార్ వద్ద ముత్యపు చిప్ప.. అందులో ముత్యాలతో ఏర్పాటు చేసిన డిజైన్ ఆకట్టుకుంది. పెరల్స్ సిటీగా పేరొందిన నగరం ప్రత్యేకతను చాటేలా ఏర్పాటు చేసిన ముత్యపు చిప్ప డిజైన్ ఇటు మిస్ వరల్డ్ పోటీదారులతో పాటు స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
● పాతబస్తీలో ప్రపంచ సుందరీమణుల సందడి
● చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్
● లాడ్‌బజార్‌లో షాపింగ్
● చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్


