
నమ్మక ద్రోహికి కటకటాలు
కడ్తాల్: పొలంలో పని చేస్తున్న మహిళపై దాడి చేసి బంగారు నగలు దోచుకెళ్లిన నిందితుడిని పోలీసులు కటకటాల పాలు చేశారు. మండలంలోని చరికొండలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను సీఐ గంగాధర్ గురువారం వెల్లడించారు. గ్రామానికి చెందిన గుల్లకుంట మహేశ్‌గౌడ్ వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఆయన బుధవారం బంధువుల పెళ్లికి హైదరాబాద్‌కు వెళ్లాడు. తన పశువుల బాధ్యతను పక్క పొలానికి చెందిన నాగిళ్ల మహేశ్‌కు అప్పజెప్పాడు. అలాగే తన తల్లి జంగమ్మకు ఆసరాగా ఉండమని సూచించాడు. అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి ఊరికి రావడానికి ఆలస్యమవుతుందని మహేశ్‌గౌడ్ తెలిపాడు. దీంతో ఇదే అదునుగా భావించిన మహేశ్ పొలంలో పని చేస్తున్న జంగమ్మ మెడలోని బంగారు పుస్తెలతాడు, చైన్(6 తులాలు) లాక్కొని దాడి చేశాడు. ఆమె అపస్మారకస్థితిలో వెళ్లడంతో చనిపోయిందని భావించి వెళ్లిపోయాడు. దొంగిలించిన సొమ్మును అదే పొలంలో దాచిపెట్టాడు. రాత్రి 10 గంటలైనా తన తల్లి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన మహేశ్‌గౌడ్ వెంటనే మహేశ్‌కు ఫోన్ చేయగా.. సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో గ్రామస్తులతో కలిసి పొలానికి వెళ్లి వెతకగా గాయాలతో జంగమ్మ కన్పించింది. మహేశ్ దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లాడని ఆమె తెలిపింది. దీంతో కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ లోకేషన్ ఆధారంగా నాగిళ్ల మహేశ్‌ను అరెస్ట్ చేశారు. దొంగిలించి బంగారంతో పాటు, సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
మహిళపై దాడి కేసును ఛేదించిన పోలీసులు

నమ్మక ద్రోహికి కటకటాలు