అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్ నగర శివారులో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని అందిన కాడికి దోచుకొని పరారవుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల ఈ తరహా ఘటనలు కలవరం పెడుతున్నాయి. ప్రతి నిత్యం గ్రామాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నా వారి కళ్లను కప్పి కేటుగాళ్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో మండలంలోని రెండు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడగా, ఈ నెలలో ఇప్పటి వరకూ పలుచోట్ల ఇళ్లలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయి సవాల్ విసురుతున్నారు.
ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు
● గత నెల 18వ తేదీన పిగ్లీపూర్‌లోని అభయాంజనేయస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోని విగ్రహానికి అమర్చిన 15 కిలోల వెండి తొడుగును అపహరించుకుపోయారు. వాహన తనిఖీల్లో ఈ నెల 4వ తేదీన ఆలయంలో దోపిడీకి పాల్పడిన ఇద్దరు దుండగులను పోలీసులు పట్టుకుని, వారి నుంచి 20 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
● అనాజ్‌పూర్ గ్రామంలో గత నెల 27వ తేదీన శివాలయంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని రెండు హుండీలతోపాటు ఎల్‌ఈడీ లైట్లను అపహరించుకుపోయారు.
● మండల పరిధిలోని కవాడిపల్లి గ్రామంలోని ఉదయ్‌గార్డెన్స్‌లో ఈ నెల 10వ తేదీన ఓ ఇంటి తాళాలు పగులగొట్టి 4 తులాల బంగారు, 80 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష మేర నగదును దోచుకెళ్లారు.
● బలిజగూడ గ్రామంలోనూ ఇదే తరహాలో ఓ ఇంట్లో ఈ నెల 10వ తేదీన దొంగతనం జరగగా.. 3 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు, రూ.38 వేల నగదు అపహరించుకుపోయారు.
● తాజాగా గురువారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సాయినగర్ కాలనీలో నివాసముండే కొత్త రమేశ్ ఇంట్లోకి చొరబడిన దుండగులు 2.5 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 తులాల వెండి పట్టీలు, 10 వేలు నగదును తస్కరించారు.
రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు
తరచూ ఇళ్లలో చోరీలు
భయాందోళనలో ప్రజలు