
బిల్డర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డ మహిళల అరెస్టు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–22లో నివసించే ప్రముఖ బిల్డర్, జీవీబీఆర్ నిర్మాణ రంగ సంస్థ ఎండీ జీవీ శేఖర్‌రెడ్డి ఇంట్లో భారీగా నగలు, నగదు చోరీ చేసిన ఘటనలో ఐదుగురు మహిళలను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..శేఖర్‌రెడ్డి ఇంట్లో గత రెండు సంవత్సరాల నుంచి హసీనా, వహీదా, అనూష అనే ముగ్గురు యువతులు పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం యజమాని బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ నుంచి రూ.7.50 లక్షల నగదు, రూ.28.50 లక్షల విలువ చేసే నగలు చోరీ చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి అనుమానితులు హసీనా, వహీదా, అనూషలను విచారించారు. వహీదా తాను చోరీ చేసిన ఆభరణాలను తన తల్లి సలీమాకు పంపించింది. అలాగే అనూష రూ.3 లక్షల నగదు తన తల్లి ఆదిలక్ష్మికి పంపించింది. డబ్బుపై ఆశతో హసీనా తనతో పాటు పనిచేస్తున్న వహీదా, అనూషలను రెచ్చగొట్టి ఈ దొంగతనానికి ఉసిగొల్పింది. ముగ్గురూ కలిసి యజమాని కళ్లుగప్పి చేతివాటం ప్రదర్శించారు. నగలు అమ్ముకుని, తలాకొంత పంచుకుని ఏదైనా వ్యాపారం చేస్తే మరింత మెరుగైన జీవితం గడపవచ్చని హసీనా ఈ ఇద్దరికి నూరిపోసింది. డబ్బులతో తమ బతుకులు మార్చుకుందామని, మరింత బాగా బతకవచ్చని భావించిన వహీదా, అనూషలు కూడా ఈ దొంగతనంలో పాలుపంచుకున్నారు. ఈ ఘటనలో హసీనా, వహీదా, అనూషలతో పాటు సలీమా, ఆదిలక్ష్మిలను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి మొత్తం నగలు, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.