ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలని అన్నారు. కుటుంబానికి మూలం మహిళ అని గుర్తు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా పెంచాలన్నారు. మహిళా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళలకు ఆర్థికంగా, విద్యాపరంగా సమాన హక్కులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారంతా మహిళా అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్‌ఓ సంగీత, జిల్లా టీజీఓ అధ్యక్షుడు డాక్టర్ రామారావు, టీజీఓ కార్యదర్శి శ్రీనేష్‌కుమార్ నోరి, జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి, సీడీపీఓ శాంతిశ్రీ, రేవతి, అలివేలు, అనిత, సుజాత, సైదమ్మ, గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.