వైకల్యాన్ని జయించి.. | - | Sakshi
Sakshi News home page

వైకల్యాన్ని జయించి..

Mar 8 2025 7:59 AM | Updated on Mar 8 2025 7:58 AM

శంకర్‌పల్లి: పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ డాక్టర్‌ కావాలనుకునే లక్ష్యాన్ని సాధించానని అంటున్నారు శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్‌ రేవతిరెడ్డి. అమ్మానాన్నలు రేయింబవళ్లు కష్టపడ్డారని.. తాను, తన అక్క కలలు కన్న లక్ష్యాల కోసం నిరంతరం తాపత్రయ పడ్డారని చెబుతున్నారు.

చదువులో చురుగ్గా..

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి, సరళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు మాధవి రెడ్డి, చిన్న కూతురు రేవతి రెడ్డి. వెంకట్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. చిన్న కూతురు రేవతిరెడ్డికి చిన్నతనం నుంచే అంగవైకల్యం ఉన్నప్పటికీ చదువులో చురుగ్గా ఉండేది. గమనించిన తండ్రి ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించాడు. శంకర్‌ పల్లి పట్టణంలోని శ్రీ వివేకానంద పాఠశాలలో 7వ తరగతి వరకు, 10వ తరగతి వరకు వికారాబాద్‌ ఎన్నేపల్లిలోని సంఘం లక్ష్మీబాయి రెసిడెన్షియల్‌ పాఠశాలలో, ఇంటర్‌ వరంగల్‌ హసన్‌పర్తిలోని ఏపీఆర్‌జేసీలో చదువుకుంది. ఎంబీబీఎస్‌లో దివ్యాంగుల కోటాలో సీటు రాకపోవడంతో ఓపేన్‌ ఎ కేటగిరీలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని మెడికల్‌ కాలేజీలో సీటు సాధించింది.

పొలం అమ్మేసి ..

కూతురికి ఎంబీబీఎస్‌లో సీటు రావడంతో తండ్రి ఎంతో సంతోషించాడు. ఎంత కష్టమైనా చదవించాలనుకున్నాడు. పెద్ద కూతురు ఎంఎస్సీ, చిన్న కూతురు ఎంబీబీఎస్‌ కోసం సంవత్సరానికి రూ.లక్షల్లో ఖర్చవుతుండడంతో ఊర్లోని ఆరు ఎకరాల పొలం అమ్మి చదివించాడు. 2008లో పెద్ద కూతురు మాధవిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించగా.. 2014లో రేవతిరెడ్డి ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. 2014 నుంచి 15 వరకు కోస్గి, 2015–18 నవాబ్‌పేట్‌, ప్రస్తుతం శంకర్‌పల్లి పీహెచ్‌సీల్లో వైద్యురాలిగా సేవలందిస్తోంది.

ప్రభుత్వం నుంచి అవార్డులు

రేవతిరెడ్డి ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు బాసటగా నిలుస్తోంది. ఆమె వైద్య సేవలను గుర్తించి 2023లో కలెక్టర్‌ ఉత్తమ వైద్యురాలి అవార్డుకి ఎంపిక చేశారు. జిల్లా వైద్యా, ఆరోగ్య శాఖ వారు సాధారణ ప్రసవాలు, ఉత్తమ సేవలకుగాను రెండు సార్లు అవార్డులు అందించారు. డాక్టర్‌ రేవతిరెడ్డికి 2017లో పాండురంగారెడ్డి తో వివాహం జరిగింది. ఆరేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నాడు. తండ్రి వెంకట్‌రెడ్డి 2020లో గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి సంరక్షణ అక్కాచెల్లెళ్లు చూసుకుంటున్నారు.

వైకల్యాన్ని జయించి..1
1/1

వైకల్యాన్ని జయించి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement