
ఇబ్రహీంపట్నం: భువనగిరి లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నేత క్యామ మల్లేశ్‌ను ప్రకటించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్యామ మల్లేశ్‌కు శనివారం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఓటమి చెందడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిస్తేజానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇదే నియోజకవర్గానికి చెందిన మల్లేశ్‌కు భువనగిరి టికెట్ ఇవ్వడంతో కొత్త జోష్ వచ్చినట్లయింది. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడకు చెందిన క్యామ మల్లేశ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. విద్యార్థి దశ నుంచి ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లో చురుకైన కార్యకర్తగా పని చేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఇబ్రహీంపట్నం మండల యూత్, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1992లో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో వివిధ దశల్లో పనిచేస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 2013లో కొనసాగారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో 2018లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. అప్పట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విజయానికి కృషి చేశారు. బీఆర్‌ఎస్‌పటిష్టతకు చురుకై న పాత్ర పోషిస్తూ కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు.
కలిసికట్టుగా పనిచేయాలి
తనపై నమ్మకంతో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు క్యామ మల్లేశ్ కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి ఖిల్లాపై బీఆర్‌ఎస్ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
రాజకీయ నేపథ్యం: 1984లో ఎన్‌ఎస్‌యూఐ ఇబ్రహీంపట్నం జూనియర్ కళాశాల ఫౌండర్‌గా, సెక్రటరీగా.. 1988 నుంచి 1989 వరకు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, 1990 నుంచి 1992 వరకు ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1992 నుంచి 1994 వరకు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, 1994 నుంచి 2000 వరకు పార్టీ మండల అధ్యక్షుడిగా, 2006 నుంచి 2013 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా, 2013 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2013 నుంచి 2018 వరకు కురమ సామాజిక వర్గం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2014లో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018లో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరి కొనసాగుతున్నారు.
ప్రొఫైల్
అభ్యర్థి: క్యామ మల్లేష్
పుట్టిన తేదీ: 5, జనవరి 1965
భార్య: జంగమ్మ
పిల్లలు: ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు
స్వగ్రామం: శేరిగూడ, ఇబ్రహీంపట్నం మండలం
విద్యార్హత: డిగ్రీ
లోక్‌సభ అభ్యర్థిగాప్రకటించిన గులాబీ బాస్
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
కృతజ్ఞతలు తెలిపిన మల్లేశ్