ఓటుకు నోటు | - | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు

Nov 27 2023 7:10 AM | Updated on Nov 27 2023 7:10 AM

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలను ఎరను ముమ్మరం చేశారు. అన్ని ప్రధాన పక్షాలూ కులాలు, సంఘాలు, అపార్టుమెంట్లు, కాలనీలు తదితర విభాగాల వారీగా నగదు, కానుకల పంపిణీ చేపట్టాయి. మద్యం పార్టీలూ జోరుగా సాగుతున్నాయి. రాత్రిళ్లు గ్రూపులు, కాలనీల వారీగా పార్టీలు ఏర్పాటు చేస్తూ ‘గుర్తుంచుకోండి’ అంటున్నారు. కాలనీల్లో ఇంటింటికీ వెళ్తున్న మహిళలు సైతం బొట్టుపెట్టి, ముచ్చట్లు చెప్పి.. కానుకలు ఇచ్చి మర్చిపోవద్దు అంటూ వెళ్తున్నారు. చురుగ్గా ఉండే యూత్‌ను మచ్చిక చేసుకొని ఆయా పార్టీల కార్యనిర్వాహకులు తమ టార్గెట్‌ పూర్తి చేస్తున్నారు. గతంలో మాదిరిగా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపులతో సమావేశాలు, యువతకు క్రికెట్‌ కిట్స్‌ పంపిణీ వంటివి ఈసారి పెద్దగా లేనట్లు కనిపిస్తోంది. యూపీఐ పేమెంట్ల ద్వారానూ కొన్నిప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఒకే నెంబరునుంచి ఎక్కువమందికి వెళ్తే గుర్తిస్తారనే అంచనాతో కొన్ని నెంబర్ల నుంచి కొందరికి పంపిస్తున్నారు.

ఓటర్ల వారీగా..

● ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల నాటి నుంచే వందమందికో వలంటీర్‌ను ఏర్పాట్లు చేసుకున్నారు. వలంటీర్లు ఇప్పటికే రెండు మూడు పర్యాయలు ఓటర్లతో ‘టచ్‌’లోకి వెళ్లారు. దాంతో ఎవరికేం కావాలో అవి చేస్తున్నారు. పంపిణీలు ఇప్పుడిప్పుడే చేపట్టినవారు ఇబ్బందులు పడుతున్నారు కానీ ఎప్పటినుంచో ఈ ప్రణాళిక అమలు చేస్తున్నవారు నమ్మకంగానే ఉన్నారు. అపార్ట్‌మెంట్లు, కాలనీల వారీగా పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతే తమకంటే ఎదుటివారు ఎక్కువ ప్రలోభపెడుతున్నారా అన్నదిఓ కంట కనిపెట్టే నిఘా బృందాల్నీ ఏర్పాటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

● పేదలు ఎక్కువగా ఉండే స్లమ్స్‌ ప్రాంతాలపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. ఫలానా స్లమ్‌లోని వారు మేమెంత చెబితే అంత అంటూ చోటామోటా నాయకులు బేరాలు పెడుతున్నట్లు సమాచారం.నేతల నుంచి సొమ్ము అందిన వారు పోల్‌చీటీల పంపిణీ పేరిట సైతం ఓటర్ల వద్దకు వెళ్లి ఫలానా వారికి వేయాల్సిందిగా సూచిస్తున్నారు. కొన్ని చోట్ల నగదు కూడా పంపిణీ ప్రారంభమైనట్లు చెబుతున్నారు.

ఆగని పంపిణీ..

అధికారులు ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా,వెళ్లాల్సిన సొమ్ము ఇప్పటికే ముఖ్యుల వద్దకు చేరిందని, ఎన్నికల నాటికి ఓటర్లకు అందేందుకు వివిధ విధానాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నగదు, కానుకలు, మద్యం.. ఇలా.. గ్రేటర్‌లో అన్ని పార్టీల నుంచి దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చవుతున్నట్లు విశ్లేషకుల అంచనా. గ్రేటర్‌ శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి నియోజకవర్గాల్లోనైతే కొందరుఅభ్యర్థులు రూ. వందకోట్లకు తగ్గకుండా ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు.

సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

ఊపందుకున్న తాయిలాల పర్వం

ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న పార్టీలు

డబ్బు, మద్యం, కానుకల పేరిట మచ్చిక

గ్రేటర్‌లో దాదాపు రూ.1,500 కోట్ల ఖర్చు

గెలుపు లక్ష్యంతో వెనుకాడని అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement