ఐక్యతతోనే అవార్డుల పంట

- - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిందని, కలిసికట్టుగా పని చేయడంతోనే ఇది సాధ్యమైందని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాస్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎంపిక చేసిన తొమ్మిది అంశాల్లో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై న పాలక వర్గాలకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీ అభివృద్ధి చెందడంతో పాటు, దాని పరిధిలోని ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ప్రభుత్వ సుపరిపాలనతో జాతీయ స్థాయిలో వరుస అవార్డులు వరిస్తున్నాయన్నారు. 2021–22 సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్రం దేశ వ్యాప్తంగా 20 ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో తెలంగాణలోని 19 గ్రామాలు ఉత్తమ జీపీలుగా ఎంపికయ్యాయని వివరించారు. గతంలో కేంద్రం పంచాయతీలకు అందించే అత్తెసరు నిధులు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయేవని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, కేంద్రం అందిస్తున్న నిధులకు సరిసమానంగా స్టేట్‌ ఫైనాన్స్‌ ద్వారా నిధులు సమకూరుస్తోందని తెలిపారు. దీంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వృద్ధి చెందాయని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగయ్యాయన్నారు. ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ అనితా హరినాథ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, జెడ్పీ సీఈవో దిలీప్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ప్రభాకర్‌, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మంత్రి సబితారెడ్డి

అట్టహాసంగా జిల్లాస్థాయి జాతీయపంచాయతీ అవార్డుల ప్రదానం

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top