● సెప్టెంబర్‌లో పాడయిన 250 ట్రాన్స్‌ఫార్మర్లు ● అక్రమ కనెక్షన్లతో విద్యుత్ కష్టాలు ● 80,289 వ్యవసాయ కనెక్షన్లు
ముస్తాబాద్: పొట్టకు వచ్చిన వరిపంట ఎండిపోతుండడంతో కాపాడుకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. చేతికొచ్చే వేళ కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవర్‌లోడ్, తరచూ కరెంట్ సరఫరాలో ఏర్పడుతున్న సమస్యలతో ట్రాన్స్‌ఫార్మ ర్లు కాలిపోతున్నాయి. ఫలితంగా పొట్ట దశలో ఉన్న వరిపంటకు నీళ్లు అందక ఎండిపోతున్నాయి. గత సెప్టెబర్ నెలలోనే జిల్లా వ్యాప్తంగా 250 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అన్నదాతల ఆందోళనబాట
జిల్లాలో కరెంట్ కోతలపై అన్నదాతలు కన్నెర్రజేస్తున్నారు. ముస్తాబాద్ కార్యాలయం ఎదుట ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు ఆందోళన చేపట్టగా, గంభీరావుపేటలో మానేరు ప్రాజెక్టు కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని ధర్నా చేశారు. ఇల్లంతకుంట, కోనరావుపేట, చందుర్తి మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 58 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా, వాటి కింద సాగు చేస్తున్న పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గత సెప్టెంబర్‌లో 250 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా.. 140 మాత్రమే మరమ్మతు చేయగలిగారు.
బకాయిలతో మరమ్మతు కేంద్రాలు
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాలకు ఎన్‌పీడీఎసీఎల్ బకాయి పడింది. దాదాపు రూ.2కోట్ల వరకు బకాయి పడడంతో, కాంట్రాక్టర్లు సైతం ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతును సకాలంలో చేయడం లేదని తెలుస్తోంది. ముస్తాబాద్, సిరిసిల్లల్లో మూడు, వేములవాడ, ఎల్లారెడ్డిపేటల్లో మరమ్మతు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. బకాయిల క్లియరెన్స్‌కు వరంగల్ ఎన్‌పీడీసీఎల్ అధికారులకు నివేదికను సమర్పించారు.
పొరుగు జిల్లాల నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు
జిల్లాలో ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు సెస్ పరిధిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ నడిచింది. 24 గంటల వ్యవధిలోనే కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేవారని రైతులు పేర్కొంటున్నారు. ఎన్పీడీఎసీఎల్‌లో సెస్ విలీనం అనంతరం విద్యుత్‌సేవల్లో వేగం లేదనే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రత, అధిక లోడ్‌తోనే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల గ్రామాలకు పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి తీసుకువచ్చి ఏర్పాటు చేస్తున్నారు.
ఎండుతున్న పంటలు
ముస్తాబాద్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
జిల్లాలో సాగు ఇలా..
వరి సాగు 1.44లక్షల ఎకరాలు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు80,289
సెప్టెంబర్‌లో కాలిన ట్రాన్స్‌ఫార్మర్లు 250
మరమ్మతు చేసినవి 140
అక్టోబర్‌లో కాలిన ట్రాన్స్‌ఫార్మర్లు 58
పంట ఎండుతోంది
మా ట్రాన్స్‌ఫార్మర్‌పైనే తరచూ ఫీజు వైరు కొట్టేస్తుంది. దీంతో కరెంట్ పోయి వరి పంట ఎండుతోంది. ఫీడర్లు మార్చిన మోటార్లు నడవడం లేదు. నాది ఎకరం ఎండుతోంది. సాయంత్రం నాలుగింటికి కరెంట్ పోయి పొద్దున కరెంట్ వస్తోంది. ఇంకో ట్రాన్స్‌ఫార్మర్ వేయాలి.
– వరద బాలయ్య, ముస్తాబాద్, రైతు
సమస్యలు అధిగమిస్తాం
అక్రమ విద్యుత్ కనెక్షన్లకు తోడు అధిక వేడితో ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు భారం పడి కాలిపోతున్నాయి. మరమ్మతు కేంద్రాలకు బకాయిలు త్వరలో చెల్లిస్తాం. ఇతర జిల్లాల నుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు వస్తున్నాయి. రైతులకు ఇబ్బందులు లేకుండా కరెంట్ సమస్యలు అధిగమిస్తున్నాం.
– శ్రీనివాస్‌రావు, ఎస్‌ఈ, సిరిసిల్ల
ఇతను ముస్తాబాద్ మండలం గోపాల్‌పల్లెకు చెందిన రైతు భూక్య గబ్బర్‌సింగ్. ఎకరంన్నర భూమిలో బోరుబావి కింద వరిసాగు చేస్తున్నాడు. పది రోజుల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. దీంతో బోరులో నీరున్నా బోరు పనిచేయక పంటకు నీరందడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్ బాగు చేయాలని ముస్తాబాద్ విద్యుత్ కార్యాలయానికి వెళ్లి మొర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వారం రోజుల్లో ఒక్క ముస్తాబాద్ మండలంలోనే ఏడు గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి.


