చందుర్తి(వేములవాడ): ఉపాధ్యాయుని వేధింపులతో నెల రోజులపాటు పాఠశాలకు దూరమైన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని హైస్కూల్ విద్యార్థిని కస్తూర్బాకు తరలించారు. డీఈవో మొండయ్య, జిల్లా శిశు, మహిళ సంక్షేమాధికారి లక్ష్మీరాజం సోమవారం అమ్మాయి ఇంటికెళ్లి ఆరా తీశారు. మండలంలోని ఓ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఫోన్‌కాల్స్‌లో వేధింపులకు గురిచేయడంతో పాఠశాలకు దూరమైంది. అధికారుల వెంట ఐసీడీఎస్ సీడీపీవో సౌందర్య, సూపర్‌వైజర్ శంకరమ్మ తదితరులు ఉన్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి–సిరిసిల్ల మానేరు వంతెనపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ డిపోకు చెందిన ఆర్డీసీ డీలక్స్ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా మానేరు వంతెనపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు వెనక కుడివైపు భాగం పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వంతెనపైనే ప్రమాదం జరగడంతో సిరిసిల్ల, తంగళ్లపల్లి రెండువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. తంగళ్లపల్లి పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


