వాహనం ఢీకొని రైతు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని రైతు దుర్మరణం

Oct 6 2026 1:24 AM | Updated on Oct 6 2026 1:24 AM

● విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

వేములవాడరూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని కోనాయపల్లి వార్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు నేదూరి భూమయ్య(85) మృతిచెందాడు. ఇంటి నుంచి ఎల్లమ్మ ఆలయ ప్రాంతంలో ఉన్న తన పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా మర్రిపల్లి నుంచి వస్తున్న వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పట్టణ సీఐ వీరప్రసాద్‌ ప్రమాదానికి కారణమైన వాహనం కోసం సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

వన్యప్రాణుల వేటకు వెళ్లి..

రాయికల్‌: వణ్యప్రాణుల వేటకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మండలంలోని దావన్‌పల్లి పరిధి గోండుగూడెంకు చెందిన మోస్రం జంగు (41) మృతిచెందాడు. ఎస్సై సుధీర్‌రావు కథనం ప్రకారం.. జంగు సోమవారం అదే గ్రామానికి చెందిన గేడం తిరుపతి, రాజేశ్‌తో కలిసి గ్రామ శివారులోని అడవికి వన్యప్రాణుల వేటకు వెళ్లారు. అక్కడ విద్యుత్‌ స్తంభం నుంచి జే వైరుతో కరెంట్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా వైరు జంగుకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. జంగుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉరేసుకొని

మహిళ ఆత్మహత్య

యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూమారేడుపాక గ్రామానికి చెందిన మెండే మణెమ్మ(44) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. మణెమ్మ ఇంటివద్ద కిరాణం నిర్వహిస్తోంది. భర్త లింగమూర్తి ఓసీపీ–3లో కాంట్రాక్ట్‌ వోల్వో డ్రైవర్‌. మణెమ్మ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో మానసికంగానూ కుంగిపోయింది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేనిసమయంలో బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. మృతురాలి సోదరుడు కనుకుంట్ల శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మతిస్థిమితం లేని బాలికపై లైంగిక దాడి

ఇబ్రహీంపట్నం: మతిస్థిమితం లేని ఓ మూగ బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ తండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తండాకు చెందిన బాలిక (12)కు మతిస్థిమితం లేదు. అదే తండాకు చెందిన నూనవత్‌ దేవదాసు (45) బాలికను నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించడంతో దేవదాసు పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పపత్రికి తరలించామని ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement