చందుర్తి(వేములవాడ): అనారోగ్య సమస్యను భరించలేక ఓ వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందుర్తి మండలం మల్యాలలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన కట్కూరి లచ్చవ్వ(72) ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఇటీవల కిడ్నీ సమస్య తలెత్తడంతో డయాలసిస్ చేసుకుంటుంది. ఈ భాదను భరించలేక గ్రామ శివారులోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై రమేశ్ తెలిపారు.
మోహినికుంటలో యువకుడు..
ముస్తాబాద్(సిరిసిల్ల): భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటకు చెందిన మోతె పూర్ణచందర్(30)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలల క్రితం భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లగా కూతురు జన్మించింది. అప్పటి నుంచి అతని భార్య తల్లిగారింటి వద్దనే ఉంటోంది. పూర్ణచందర్ మద్యానికి బానిసయ్యాడు. అత్తగారింట్లో ఎల్లమ్మ పండగ సోమవారం ఉండగా వెళ్లలేదు. మద్యం మత్తులో ఉన్న పూర్ణచందర్ భార్య కాపురానికి రావడం లేదని ఎలా వెళ్లేదంటూ మనస్తాపం చెంది తన గదిలో చీరతో ఉరివేసుకున్నాడు. గమనించిన తండ్రి కిషన్ వెంటనే తలుపులు బద్దలు కొట్టి కొడుకును కిందకు దింపి ముస్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. తండ్రి కిషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
గుర్తు తెలియని మహిళ మృతి
వేములవాడఅర్బన్: వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. మృతురాలి వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండవచ్చని వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిస్తే టౌన్ ఠాణాలో 87126 56413లో సంప్రదించాలని కోరారు.


