సమస్యలున్నా.. సమన్వయంతో సేకరిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

సమస్యలున్నా.. సమన్వయంతో సేకరిస్తున్నాం

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

ఇప్పటికే 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

సెలవు రోజూ కొనుగోలు.. ఆన్‌లైన్‌ ట్యాబ్‌ ఎంట్రీ

ఏడు కేంద్రాల్లో సేకరణ పూర్తి

3,909.050 టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు

‘సాక్షి’తో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

కంట్రోల్‌ రూమ్‌ నంబరు : 63039 28692

టోల్‌ ఫ్రీ నంబర్లు 1800 4250 0333, 1967

సిరిసిల్ల: జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఆదివారం సెలవు రోజు అయినా అధికారులు ధాన్యం సేకరణ, రవాణాపై ఫోకస్‌ పెట్టి పనిచేస్తున్నారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ప్రత్యేక చొరవతో అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించి, నిత్యం టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. హమాలీల కొరత, లారీల సమస్యలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమస్యలు ఎదురైనా.. సమన్వయంతో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తున్నామని అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) గడ్డం నగేశ్‌ అన్నారు. ఇప్పటికే 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. ఆ విశేషాలివీ..

హమాలీలు, లారీల కొరతను ఎలా అధిగమించారు?

అదనపు కలెక్టర్‌: హమాలీల సమస్య మొదట్లో ఉంది. ఎండలతో స్థానికంగా తూకం వేసే హమాలీలు సైతం ఇబ్బందులు పడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల జరగడంతో వలస కార్మికులు రైస్‌ మిల్లులకు వస్తామని చెప్పిన సమయానికి రాలేదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. లారీల సమస్య ఉన్నా ట్రాక్టర్లలోనూ వడ్లను తరలించే అవకాశాన్ని కలెక్టర్‌ కల్పించారు. దీంతో లారీల సమస్య కొంత మేరకు తీరింది. లారీల కాంట్రాక్టర్లతో నిత్యం మాట్లాడుతూ ధాన్యం రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నాం. వడ్లను తూకం వేసి 24 గంటల్లోనూ మిల్లులకు, గోడౌన్లకు తరలిస్తున్నాం. ఇప్పటికే ఏడు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవవడంతో, మూసి వేశారు. అక్కడి హామాలీలను, లారీలను ఇతర ప్రాంతాలకు తరలించాం.

జిల్లాలో ఎన్ని మిల్లులకు ధాన్యం కేటాయించారు?

అదనపు కలెక్టర్‌: జిల్లాలో 38 పారాబాయిల్డ్‌ మిల్లులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కేటాయించాం. మరో నాలుగు రా రైస్‌మిల్లులకూ కేటాయించాం. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చెందిన ఆరు గోదాములు, అపెరల్‌పార్క్‌లోని మరో గోదాములోనూ ధాన్యం నిల్వ చేస్తున్నాం. జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు ఎలా చేస్తున్నారు?

అదనపు కలెక్టర్‌: ధాన్యం కొనుగోలు చేసి, ట్యాబ్‌ ఎంట్రీ చేయిస్తున్నాం. ఆదివారం సెలవు రోజు సైతం ఆన్‌లైన్‌ ట్యాబ్‌ ఎంట్రీ చేయించాం. ఇప్పటికే జిల్లాలో 19,990 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.323.97 కోట్లు జమయింది. రైతులు వడ్లను అమ్ముకున్న వారం రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నాం. పేమెంట్‌ ఇబ్బందులు లేవు.

మొక్కజొన్న కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయి?

అదనపు కలెక్టర్‌: జిల్లాలో రుద్రంగి, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు రుద్రంగిలో 534 మంది వద్ద 45,900 బస్తాల మొక్కజొన్నలను కొనుగోలు చేశాం. ఇల్లంతకుంటలో 273 మంది వద్ద 32,281 బస్తాలను కొనుగోలు చేశాం. జిల్లాలో మొత్తం 807 మంది రైతుల వద్ద 3,909.050 టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశాం.

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

అదనపు కలెక్టర్‌: ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. తాగునీటి వసతి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు, టెంటు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించాం. కొనుగోళ్లలో ఇబ్బందులు నివారించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఫోన్‌ నంబరు: 63039 28692 ఏర్పాటు చేశాం. టోల్‌ ఫ్రీ నంబర్లు 1800 4250 0333, 1967 ఉన్నాయి. రైతులకు ఏమైనా ఇబ్బంది ఎదురైతే ఈ ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చు.

ధాన్యం సేకరణ లక్ష్యమెంత? ఇప్పటికీ కొనుగోలు చేసిందెంత?

అదనపు కలెక్టర్‌: జిల్లాలో యాసంగి సీజన్‌లో 1,87,189 ఎకరాల్లో వరిపంటను సాగుచేశారు. ఇందులో దొడ్డు రకం 1,79,650 ఎకరాలు, 7,539 ఎకరాల్లో సన్నరకం సాగుచేశారు. మొత్తంగా 3.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశాం. ఇందులో 3 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 2 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. సగటున నిత్యం 8 వేల నుంచి 10 వేల టన్నులు కొనుగోలు చేస్తున్నాం.

Advertisement
 
Advertisement
Advertisement