● రాజన్న ఆలయ అభివృద్ధిపై శీతకన్ను ● సిమెంటు వినియోగంపై సర్వత్రా విమర్శలు ● కోడెమొక్కులకు భక్తుల ఎదురుచూపులు
● వచ్చే ఏడాదికి సిద్ధం చేస్తామని అధికారుల ధీమా
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంటే, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రిలో శాస్త్రబద్ధంగా, ప్రణాళికా బద్ధంగా నిర్మాణం సాగగా.. వేములవాడలో అస్పష్టత, సమన్వయలోపంతో విమర్శల పాలవుతోంది. ఈ మధ్య పనులు కాస్త ఊపందుకున్నప్పటికీ.. సిమెంట్ నిర్మాణాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఈ సిమెంటు నిర్మాణాలు ఎంతకాలం ఉంటాయి? కోడెమొక్కుల దర్శనాలు భక్తులకు తిరిగి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? అన్న అంశాలు నేటికీ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ.. రూ.1200 కోట్లతో యదాద్రి, రూ.225 కోట్లతో బాసర ఆలయాలకు దక్కినస్థాయిలో గౌరవం దక్కకపోవడం, వేములవాడ ఆలయానికి కేవలం రూ.150 కోట్లే వెచ్చించడంతో రాజన్న భక్తులు చిన్నబుచ్చుకుంటున్నారు. మరోవైపు అధికారులు వచ్చే ఏడాది మార్చి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేసే దిశగా వేగంగా పనులు సాగిస్తున్నారు.


