● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ప్రజావాణిలో 300 అర్జీలు స్వీకరణ
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితులు నుంచి అర్జీలు స్వీకరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాదాపు 300 దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో రాజేందర్‌రెడ్డి 9 దరఖాస్తులు స్వీకరించారు. వేములవాడలో ఆర్డీవో కేఎస్‌బీ కుమారి 12 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
సిరిసిల్ల పట్టణంలో రూ.50 లక్షలు ఖర్చు చేసి నాలుగు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వినియోగంలో లేవు. వాటి నిర్వహణకు రూ.12,500 చొప్పున చెల్లించారు. ఆ డబ్బుల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి. టాయిలెట్స్‌ను వినియోగంలోకి తీసుకురండి.
– మేకల కమలాకర్, సంజీవయ్యనగర్, సిరిసిల్ల
గంభీరావుపేట మండలం నర్మాల, కోళ్లమద్ది, బరిగెలగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులకు మూడేళ్ల క్రితం నీటి సరఫరా చేశాను. ఆ బిల్లులు అధికారులు ఇవ్వడం లేదు. బిల్లులు ఇప్పించండి. – ఎ.కేశవరావు,
మాజీ సర్పంచ్, కోళ్లమద్ది
నేను గతంలో మవోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పని చేసిన. 2023లో ప్రభుత్వ పిలుపు మేరకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎదుట జనజీవన స్రవంతిలో కలిసిన. నాకు ప్రభుత్వం ప్రకటించిన 3 గుంటల నివాస స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పించండి. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఇస్తానన్న భూమిని ఇచ్చి న్యాయం చేయండి.
– జ్యోతి అలియాస్ జ్యోతక్క, మాజీ మావోయిస్టు


