సిరిసిల్లలో వస్త్రోత్పత్తి స్వరూపం
చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తున్నాం
● రూ.105 కోట్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ● తొలి విడతగా 3.01 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ● 130 మ్యాక్స్ సంఘాలకు ఆర్డర్లు అందిస్తున్న అధికారులు ● ఇందిరా మహిళా శక్తి చీరల రంగు, డిజైన్‌లో మార్పులు
ఇది సిరిసిల్లలోని మరమగ్గాల(పవర్‌లూమ్స్) కార్ఖానా. ఇక్కడి సాంచాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఒక్కో మగ్గంపై నిత్యం 80 నుంచి 100 మీటర్ల బట్ట ఉత్పత్తి అవుతుంది. ఒక్కో నేతకార్మికుడు ఐదు నుంచి ఆరు సాంచాలపై వస్త్రం ఉత్పత్తి చేస్తాడు. 10 గంటలపాటు పనిచేస్తే నెలకు కూలీ(వేతనం) రూ.7వేల నుంచి రూ.10వేలు వస్తాయి. అదే ప్రభుత్వం ఇచ్చే చీరల ఆర్డర్ల బట్టను ఉత్పత్తి చేస్తే కార్మికులకు ఇచ్చే వేతనాన్ని(కూలి)ని జౌళిశాఖ నిర్ణయిస్తుంది. దీని ద్వారా మెరుగైన వేతనం అందుతుంది. ఇదే పనికి దాదాపు రెండింతలు అంటే ఒక్కో కార్మికుడికి రూ.12 వేల నుంచి రూ.18వేల వరకు ఆదాయం పొందుతాడు.
చిలుకపచ్చ రంగులో ఇందిరా మహిళా శక్తి చీరల కొత్త డిజైన్
సిరిసిల్ల: రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం కానుకగా ఇందిరా మహిళాశక్తి చీరలను అందించేందుకు నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిరిసిల్ల నేతన్నలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తుంది. ఈనెల 6న రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్, విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ వస్త్రోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లకు సంబంధించిన విధి విధానాలు వివరించారు. ఈమేరకు తొలివిడతగా 3.01 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను అందిస్తున్నారు. ఈ బట్ట విలువ రూ.105 కోట్ల మేరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఆర్డర్లు పొందిన వస్త్రోత్పత్తిదారులు నూలును దిగుమతి చేసుకుని చీరలను ఉత్పత్తి చేయాల్సి ఉంది. జూలై నెలాఖరులోగా చీరల బట్టను అందించాలని అధికారులు గడువు విదించారు. ప్రభుత్వ ఆర్డర్లతో వస్త్రోత్పత్తి రంగంలో మెరుగైన కూలి రేట్లు, కార్మికులకు వేతనాలు లభించనున్నాయి.
52 మ్యాక్స్‌లకు నూలు సరఫరా
సిరిసిల్లలో 130 మ్యాక్స్ సంఘాలు ఉండగా 52 సంఘాలకు నూలు అందించేందుకు అర్హత సాధించాయి. నిజానికి మ్యాక్స్ సంఘాల్లో బడా సేట్లు ఉన్నారు. మధ్యతరగతి ఆసాములు, వస్త్రోత్పత్తిదారులకు 90 శాతం అరువు(ఉద్దెర)పై నూలును వేములవాడ నూలు డిపో ద్వారా గతేడాది నుంచి అందిస్తున్నారు. చీరల ఉత్పత్తికి అవసరమైన నూలుకు పది శాతం డబ్బును డీడీ రూపంలో మ్యాక్స్ సంఘాల ప్రతినిధులు అందిస్తే.. నూలును కొనుగోలు చేసి 90 శాతం అరువుపై సరఫరా చేస్తారు. ఆ నూలు తెచ్చి భీములు పోసి, సాంచాలపై చీరల బట్టను ఉత్పత్తి చేసి, బట్టను జౌళిశాఖకు అందించాల్సి ఉంటుంది. కొంత ఆలస్యమైనా నూలును మ్యాక్స్‌లకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తున్నాం. గతేడాది తరహాలోనే బార్డర్‌తో కూడిన నాణ్యమైన వైట్ కలర్ చీరల బట్టను ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఆ చీరలను కొత్త డిజైన్‌లో ప్రింట్ చేయించి పంపిణీ చేస్తారు. ఈసారి చిలుక పచ్చనిరంగులో, ఎర్రని బార్డర్‌తో చీరలను డిజైన్ చేశారు. సిరిసిల్లలోని 130 మ్యాక్స్ సంఘాలకు ఆర్డర్లు ఇస్తున్నాం. ఇది పూర్తయితే మరో విడత చీరల ఉత్పత్తి ఆర్డర్లు సిరిసిల్లకు రానున్నాయి.
–ఎస్.సంతోష్‌కుమార్,
చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల
మరమగ్గాలు
: 27వేలు
మ్యూచువల్
ఎయిడెడ్ కోఆపరేటివ్
సొసైటీలు(మ్యాక్స్)
: 130
మ్యాక్స్‌ల పరిధిలో
ఉండే మరమగ్గాలు
: 10,120
మ్యాక్స్‌ల్లో ఉండే
ఆసాములు : 1,623
వస్త్రోత్పత్తిపై
ఆధారపడిన
నేతకార్మికులు
: 10 వేలు
ప్రభుత్వ ఆర్డర్లతో
లభించే
ఉపాధి కాలం
: 6 నెలలు


