చదువే ఆస్తి.. సేవే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

చదువే ఆస్తి.. సేవే లక్ష్యం

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

● వేములవాడ పట్టణ అభివృద్ధే ధ్యేయం ● ‘సాక్షి’తో మున్సిపల్‌ కమిషనర్‌ గుండ్లూరి లోకేశ్‌

● వేములవాడ పట్టణ అభివృద్ధే ధ్యేయం ● ‘సాక్షి’తో మున్సిపల్‌ కమిషనర్‌ గుండ్లూరి లోకేశ్‌

వేములవాడ: ‘చదువే నిజమైన ఆస్తి’ అని యువతకు సందేశమిస్తూ వేములవాడ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని మున్సిపల్‌ కమిషనర్‌ గుండ్లూరి లోకేశ్‌ పేర్కొన్నారు. ఐఏఎస్‌ లక్ష్యంగా సివిల్‌ కోచింగ్‌తో ప్రయాణం ప్రారంభించారు. 2024లో గ్రూప్‌–1లో సెలెక్టు అయి వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. వేములవాడ అభివృద్ధే లక్ష్యమని యువ కమిషనర్‌ వివరించారు. తొలి పోస్టింగ్‌తోనే సేవా దృక్పథంతో ముందుకు సాగుతానన్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’కి పలు విషయాలు వివరించారు.

కుటుంబ నేపథ్యం.. చదువు

అమ్మానాన్న మాలతి–ఆంజనేయులు. హైదరాబాద్‌లోని లింగంపల్లిలో ఉంటారు. చెల్లి లత ఎంఫార్మాసీ చదువుతున్నారు. పఠాన్‌చెరువులోని ప్రైవేట్‌ స్కూల్‌లో 1 నుంచి 10 వ తరగతి, ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌, 2022లో సీబీఐటీ నుంచి బీటెక్‌ పూర్తిచేశా. సివిల్స్‌పై దృష్టి పెట్టి 2024లో గ్రూప్‌–1లో విజయం సాధించా. 2025 సెప్టెంబర్‌లో కమిషనర్‌గా సెలెక్టు చేసి ట్రైనింగ్‌ ఇచ్చారు. మున్సిపల్‌ కమిషనర్‌గా రాజన్న సన్నిధిలో తొలి పోస్టింగ్‌ రావడం నా అదృష్టమే. యూత్‌ ఎదగడానికి శ్రమ, క్రమశిక్షణ, కుటుంబ ప్రోత్సాహం ఉండాలి. నేను నమ్మేది చదువే నిజమైన ఆస్తి. ఈ నమ్మకమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

తొలి పోస్టింగ్‌ వేములవాడ

దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సన్నిధిలో తొలి పోస్టింగ్‌ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మానాన్న, చెల్లితో కలసి మంగళవారం రాజన్నను దర్శించుకున్నాము. ఇక్కడి ప్రజలకు, భక్తులకు మెరుగైన సేవలు అందించడమే నా ప్రధాన లక్ష్యం. వేములవాడకు వేలాది మంది భక్తులు వస్తున్నందున పారిశుధ్యం, స్వచ్ఛ తాగునీటి సరఫరా, పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెడతాం. మునిసిపల్‌లోని ప్రతీ వార్డులో సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా స్పష్టమైన ప్రణాళికతో పనిచేస్తాం. వేములవాడ వాట్సాప్‌ చానల్‌ ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ప్రజల సహకారమే ప్రధానం.

నిరంతర శ్రమ, క్రమశిక్షణ

నిరంతర శ్రమ, క్రమశిక్షణ, అన్నింటికీ మించి మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. నేను నమ్మే సిద్ధాంతం ఒక్కటే.. ఎవరికై నా ‘చదువే నిజమైన ఆస్తి’. ఆ నమ్మకమే ఎక్కువ గంటలు చదవకుండా టాపిక్‌ వైజ్‌ చదువుకుంటూ ముందుకు సాగాను. టెస్ట్‌ సిరీస్‌ రాసుకుంటూ సరిచేసుకుని ప్రిపేర్‌ అయ్యాను. ప్రస్తుతం యువత సోషల్‌ మీడియా వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దానికంటే తమ కెరీర్‌, జీవిత లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. నిరంతర శ్రమ, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పరీక్షనైనా సులువుగా సాధించవచ్చు. ప్రస్తుతం ఏఐ వల్ల చాలా జాబ్స్‌ పోతున్నాయి. అందుకే స్కిల్స్‌ డెవలప్‌ చేసుకోవాలి. జాబ్స్‌ మనమే క్రియేట్‌ చేసేలా ముందుకు సాగాలి.

Advertisement
 
Advertisement
Advertisement