ఇసుక లేక ఆగిన పనులు
స్థానికంగా రీచ్‌లు కరువు
పొత్తూర్, వేములవాడ రీచ్‌ల నుంచి సరఫరా
దూరభారంతో పెరిగిన ధరలు
ట్రిప్పునకు రూ.5వేలకు పైగానే వసూలు
బోయినపల్లి(చొప్పదండి): మండలంలో ఇసుక రీచ్‌లు లేక భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. వేములవాడ, పొత్తూరు రీచ్‌ల నుంచి ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది. చలాన్ చెల్లించి కొందామన్న బోయినపల్లి మండల ట్రాక్టర్లను ఆయా రీచ్‌లకు రానివ్వడం లేదు. దీంతో అక్కడి ట్రాక్టర్ యజమానులు బోయినపల్లి మండలానికి ఇసుక సరఫరా చేయాలంటే ట్రిప్పునకు రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తం పెట్టలేక చాలా మంది భవన నిర్మాణ పనులు నిలిపివేశారు.
ఇసుక రీచ్ ఉన్న వాహనాలే దిక్కు
ఇందిరమ్మ ఇల్లుకు ఒక్కో ట్రిప్పు ఇసుకకు రూ.215, ఇతర గృహనిర్మాణాలకు రూ.720 చలాన్ చెల్లించాల్సి ఉంది. మన ఇసుక వాహనం కింద బుక్ చేసుకున్న వారు తమ వాహనంలో తీసుకెళ్లవచ్చు. కానీ ఇసుక రీచ్‌లు ఉన్న గ్రామాల వారు ఇతర ప్రాంత వాహనాలను రానివ్వడం లేదు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమి చర్యలు తీసుకోవడం లేదు.
మిడ్‌మానేరు డౌన్‌స్ట్రీమ్‌తో మంజూరుకాని రీచ్
మిడ్‌మానేరు పరిధిలోని మానేరువాగులో గతంలో బోయినపల్లి మండలం మాన్వాడ, వరదవెల్లి, మల్లాపూర్ నుంచి ఇసుక రవాణా జరిగేది. కాగా మిడ్‌మానేరు డౌన్‌స్ట్రీమ్ నుంచి ఇసుక తీయరాదనే నిబంధనలతో మాన్వాడను ఇసుక రీచ్‌గా అధికారులు గుర్తించలేదని సమాచారం. దీంతో మండలంలోని గృహ నిర్మాణదారులకు ఇసుక దొరకడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక ధరలకు కల్లెం వేయడంతోపాటు రీచ్‌లకు ఇతర గ్రామాల వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


