● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: నైపుణ్యముంటేనే ఏ రంగంలోనైనా రాణిస్తారని, నైపుణ్యాభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి సదస్సును జ్యోతి వెలిగించి, జయ జయహే తెలంగాణ గీతంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర అభివృద్ధిలో నేటి యువత, విద్యార్థులు చాలా కీలకమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యా శాఖ వారోత్సవాలను నిర్వహించామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఎన్నో అంశాల్లో ప్రతిభ చూపారని గుర్తు చేశారు. ఉన్నత చదువుతోపాటు టెక్నికల్ స్కిల్స్, సాప్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు. ఐటీఐ, టాస్క్ తదితర సంస్థల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నర్సింగ్ పూర్తి చేసి, విదేశి భాష, నైపుణ్యాల్లో పట్టు ఉన్నవారికి టామ్ కామ్ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో ఉపాధి కల్పన అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు 45 మందికి విదేశాల్లో కొలువులు వచ్చాయని తెలిపారు. యువత ఉపాధిని పొంది తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత చూసుకోవాలని సూచించారు.
ధాన్యం తరలింపులో వేగం పెంచాలి
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్‌లోడింగ్‌లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం, నిర్దేశించిన మిల్లులు, గోదాములకు తరలించడంపై అధికారులు దృష్టి సారించి, క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదాముల్లో హమాలీలకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన ఆన్‌లైన్ ట్యాబ్ ఎంట్రీ జాప్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, జీఎం ఇండస్ట్రీస్ హనుమంతు, డీవైఎస్‌వో రాందాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఎల్‌డీఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


