‘సెస్‌’ కథ ముగిసింది | - | Sakshi
Sakshi News home page

‘సెస్‌’ కథ ముగిసింది

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

● ఇక నుంచి ఎన్‌పీడీసీఎల్‌ సేవలు

● ఇక నుంచి ఎన్‌పీడీసీఎల్‌ సేవలు

సిరిసిల్ల: జిల్లాలో 56 ఏళ్లుగా విద్యుత్‌ పంపిణీ సేవలు అందిస్తున్న సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) కథ ముగిసింది. ఇకపై ఎన్‌పీడీసీఎల్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కిల్‌గా సేవలు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) ఓపీ నంబరు 08 ఆఫ్‌ 2026 తేదీ 19.05.2026ను డాక్టర్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌(చైర్మన్‌), సభ్యులు రఘు కంచర్ల, చెరుకూరి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ‘సెస్‌’ లెసెన్స్‌ను పునరుద్ధరించకుండా, 2026 ఏప్రిల్‌ 1 నుంచి ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు తాత్కాలికంగా విద్యుత్‌ పంపిణీ(నిర్వహణ) సేవలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అందిస్తున్నారు.

పాలకవర్గం ఉండగానే..

1970లో ‘సెస్‌’ను స్థాపించారు. ప్రస్తుతం 3 లక్షల సభ్యత్వాలున్న ‘సెస్‌’కు వినియోగదారులతో ఎన్నుకోబడిన పాలకవర్గం ఉంది. చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్‌ చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి, 13 మంది డైరెక్టర్లుగా ఉన్నారు. వీరి పదవీకాలం ఇంకా 19 నెలలు ఉంది. కానీ, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు పాలకవర్గం జోలికి వెళ్లకుండానే ‘సెస్‌’ ఉద్యోగులను తమ కంట్రోల్‌లోకి తీసుకుని విద్యుత్‌ పంపిణీ సేవలను అందిస్తున్నారు. ఎన్‌పీడీసీఎల్‌ తీరుపై ‘సెస్‌’ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించగా, విచారణ వాయిదాలు పడుతూ వస్తుంది. ‘సెస్‌’ పాలకవర్గం వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం, ఎన్‌పీడీసీఎల్‌ వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేయడంతో విచారణ పర్వం కోర్టులో కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో అమలులో ఉన్న విద్యుత్‌ సంస్కరణలను జిల్లాలో అమలు చేస్తూ వినియోగదారుల మన్నలను పొందాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సిరిసిల్ల సర్కిల్‌గా నామకరణం

ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ కంపెనీ లిమిటెడ్‌(ఎన్‌పీడీసీఎల్‌) సిరిసిల్ల సర్కిల్‌గా ‘సెస్‌’ పరిధి మారనుంది. ఏది ఏమైనా పాలకవర్గాల అవినీతి, అక్రమాలు, నిర్వహణ లోపాలు, ప్రభుత్వ బకాయిలు, పాలకుల రాజకీయ కుట్రలతో 56 ఏళ్ల ‘సెస్‌’ ఇప్పుడు ఉనికి కోల్పోయింది. ఇప్పటికే జిల్లాలో విద్యుత్‌ సేవలు అందిస్తున్న ఎన్‌పీడీసీఎల్‌ తాజా పరిణామాలతో పూర్తిస్థాయిలో ‘సెస్‌’ ను హస్తగతం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. ఇక ‘సెస్‌’ కథ ముగిసినట్లేనని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement