● జిల్లా కేంద్రంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సిరిసిల్ల: జిల్లాలో భానుడి భగభగలతో జనం అల్లాడిపోయారు. సిరిసిల్లలో మంగళవారం అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పట్టణ శివారులోని కలెక్టరేట్ వద్ద 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చందుర్తి మండలం మర్రిగడ్డ వద్ద 45.5, కోనరావుపేట మండలం మర్తనపేట వద్ద 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడంతో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం ఎండల ధాటికి వేడి గాలి వీచింది. ఉక్కపోత, వడగాలుల ధాటికి జనం హడలిపోయారు. జిల్లా కేంద్రంతో పాటు, కోనరావుపేట, చందుర్తి మండలాల్లో రెడ్‌అలర్ట్, అన్ని మండలాల్లో ఆరేంజ్ కలర్ అప్రమత్తతను అధికారులు ప్రకటించారు. పగటి పూట బయట తిరగొద్దని హెచ్చరించారు.
ఇతర ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
వేములవాడ మండలం వట్టెంల వద్ద 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మల్లారం వద్ద 44.8, రుద్రంగి 44.7, బోయినపల్లి 44.6, ముస్తాబాద్ మండలం నామాపూర్ 44.6, వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి 44.5, తంగళ్లపల్లి మండలం నేరెళ్ల 44.4, మానాల 44.3, ఎల్లారెడ్డిపేట 44.2, గంభీరావుపేట 44, వీర్నపల్లి, పెద్దలింగాపూర్ 43.9 గంభీరావుపేట మండలం గజసింగారం 43.8, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ 43.6, ముస్తాబాద్ మండలం ఆవునూర్ 43.5, ఇల్లంతకుంట 43.4, కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బోయినపల్లిలో 33.7 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.


