సిరిసిల్ల/చందుర్తి: జిల్లాలోని చందుర్తి సీఐగా పని చేస్తున్న గాండ్ల వెంకటేశ్వర్లుకు డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీగా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఐటీఐ కాలేజీలో అడ్మిషన్లు
సిరిసిల్ల: జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. 2026–27 సంవత్సరానికి (ఒకటి, రెండు సంవత్సరాల) కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రకటించారు. ఎలక్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, వెల్డర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్సెస్సీ మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్స్, టీసీ, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్‌తో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
పని చేసేవారికి గుర్తింపు
వేములవాడ: పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఈవో రమాదేవి అన్నారు. ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటలక్ష్మికి పర్యవేక్షకులుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఉద్యోగులపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. డీఈవో భాస్కరశర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ల కమీషన్ విడుదల
ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో మహిళా సంఘాలు చేపట్టిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రెండు సీజన్ల కమీషన్ డబ్బులు గ్రామైక్య సంఘాల ఖాతాల్లో జమ చేశామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.గీత బుధవారం ప్రకటనలో తెలిపారు. 2024–25లో రబీ, ఖరీఫ్ సీజన్లలో చేపట్టిన ధాన్యం సేకరణలో మహిళా సంఘాలకు చెల్లించాల్సిన కమీషన్లు రూ.7.59 కోట్లు విడుదల చేశామన్నారు. సమాచార లోపంతో మహిళా సంఘాల బాధ్యులు బ్యాంక్ ఖాతాలు చూసుకోలేదని పేర్కొన్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడి పరిస్థితి విషమం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఇంటికి బైక్‌పై వస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామానికి చెందిన సుల్తాని అంజిరెడ్డి కుమారుడు సాకేత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం ఇంటికి హైదరాబాద్ నుంచి తన బైక్‌పై వస్తుండగా, రాచర్లగొల్లపల్లి పెట్రోల్ పంపు సమీపంలో ట్రాక్టర్ రోడ్డుకు అడ్డు రావడంతో ఢీకొని కిందపడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాదులోని హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వేములవాడఅర్బన్: రోడ్డు ప్రమాదంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన ఎస్.రవి (35)బుధవారం వేకువజామున వేములవాడకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా నాంపల్లి శివారులోని సిరిసిల్ల– కరీంనగర్ రహదారిలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. రవి ఇటీవలే గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
వేములవాడరూరల్: వేములవాడ మండలం లింగంపల్లి ఇసుక రీచ్ నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై వెంకట్రాజం తెలిపారు. చెక్కపల్లికి చెందిన ట్రాక్టర్ 27వ తేదీ ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకుని 29వ తేదీ బుధవారం ఇసుక తీసుకెళ్తుండగా గ్రామ శివారులో తనిఖీ చేసి పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు.
వ్యక్తిపై కేసు
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కళాజ్యోతి సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపారు. వివరాలు.. మండలంలోని నర్సింగపూర్‌కు చెందిన నాగుల తిరుపతి తన ఇంటిపై బ్యాంకు రుణం తీసుకునేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం పంచాయతీ కార్యదర్శి కళాజ్యోతి సంతకాన్ని ఫోర్జరీ చేసి హౌజింగ్ లోన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. రుణం మంజూరు చేసే బ్యాంక్ ప్రతినిధి వెరిఫికేషన్ కోసం పంచాయతీ కార్యదర్శి వద్దకు రాగా, సంతకం ఫోర్జరీ అని తేలింది. దీంతో తిరుపతి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నకిలీ స్టాంపులు, డ్యాకుమెంట్ తయారు చేసిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.


