● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో నకిలీ విత్తనాల నియంత్రణ, సన్న వడ్లు, ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంపు, ఫార్మర్స్ రిజిస్ట్రీ అంశాలపై కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు రూపొందించిన కరపత్రాలను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు చేయాలని, ఏమైనా విక్రయాలు ఉంటే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నేరుగా వచ్చి విత్తనాలు విక్రయించే వారి వద్ద రైతులు తీసుకోవద్దని కలెక్టర్ సూచించారు.
ఫార్మర్స్ రిజిస్ట్రీ పూర్తి చేయండి
జిల్లాలో ఫార్మర్స్ రిజిస్ట్రీ ఇప్పటిదాకా 73 శాతం పూర్తి చేశారని కలెక్టర్ వెల్లడించారు. వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలు, రైతులను నేరుగా కలిసి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సన్న వడ్లు సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ఆయిల్‌పాం సాగు ద్వారా అధిక దిగుబడి, దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, జిల్లా సహకార అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.


