● ఎస్పీ మహేశ్ బి గితే
సిరిసిల్ల: జిల్లాలో అసాంఘిక శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, కేసు ఏదైనా నిందితులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీస్‌లో జరిగిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రజలు, వ్యాపారస్తులను భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పెట్రోలింగ్ సమయాల్లో రౌడీ, హిస్టరీ షీట్స్ ఉన్నవారిని తనిఖీ చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా చేసే వ్యక్తులతో పాటు సేవించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను తప్పించుకుని తిరుగుతున్న నిందితులను పట్టుకోవాలన్నారు. పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, పెండింగ్ అంశాలను సమీక్షించారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణలో వాహనాల పాత్ర కీలకం
జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా నేర సమాచారం అందిన వెంటనే బ్లూకోల్ట్, పెట్రోకార్ సిబ్బంది ఘటన స్థలానికి వేగంగా చేరుకోవడం ఎంతో కీలకమని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్ ఆవరణలో పోలీస్ వాహనాల కోసం నూతనంగా నిర్మించిన షెడ్‌ను ప్రారంభించి మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు రక్షణ కల్పించడంలో వాహనాలు ఎంతో అవసరమన్నారు. పోలీసులు క్షేత్రస్థాయిలో తక్షణమే స్పందించించేందుకు పెట్రోకార్, బ్లూ కోల్ట్ వాహనాల కండిషన్ బాగుండాలన్నారు. పోలీసు అధికారులతో కలిసి షెడ్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లకు కేటాయించిన పెట్రోకార్ వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణపై ఆరా తీశారు.


