భీమన్న ఆలయంలో కమిషనర్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

భీమన్న ఆలయంలో కమిషనర్‌ పూజలు

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

వేములవాడఅర్బన్‌: వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా భీమేశ్వర సదన్‌ అతిథి గృహానికి చేరుకున్న కమిషనర్‌కు ఆలయ ఈవో రమాదేవి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకోగా, అర్చకులు, వేద పండితులు స్వస్తివాచకంతో స్వాగతం పలికారు. తర్వాత స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుని, ఆలయ మండపంలో తీర్థప్రసాదం, ఆశీర్వచనం స్వీకరించారు. ఆలయ ఈవో స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈసందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై కమిషనర్‌ ఆరా తీశారు. క్యూలైన్లు, శానిటేషన్‌ ఏర్పాట్లు పరిశీలించి, ఎండాకాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన చర్యలను సమీక్షించారు. లడ్డూ తయారీ కేంద్రం, ఆలయంలో నిర్వహిస్తున్న ఈ–టికెటింగ్‌ సేవలను పరిశీలించారు. గోశాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. పశుగ్రాసాన్ని స్వయంగా కోడెలకు అందించి, అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు. కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు పరిశీలించారు. ఎండోమెంట్‌ అడ్వైజర్‌ గోవిందహరి, క్షేత్ర ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణమూర్తి, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement