మండుటెండలోనే పనులు కనిపించని టెంట్లు పనిప్రదేశంలో సౌకర్యాలు కరువు ఇబ్బంది పడుతున్న కూలీలు ఇప్పటికే వడదెబ్బతో ఒకరి మృతి, ఇద్దరికి అస్వస్థత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): భానుడు భగభగ మండిపోతున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బయటకు వెళ్లాలంటే జంకే పరిస్థితులు ఉన్నాయి. ఉపాధిహామీ కూలీలు మాత్రం ఎండలోనే పనులు చేస్తున్నారు. అధికారులు నిబంధనలు పాటించడం లేదు. దీంతో జిల్లాలో ఇటీవల ఒక ఉపాధిహామీ కూలీ మరణించగా, ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు. పనిచేసే చోట నీడ లేక.. నీళ్లు లేక.. కూలీలు అల్లాడుతున్నారు. ఉపాధిహామీ కూలీల ఇక్కట్లపై సాక్షి ‘ఫోకస్’.
కనీస సౌకర్యాలు కరువు
ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలనే నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదు. కూలీలకు నీడ కోసం టెంట్లు, చలువ పందిర్లు వేయాలి. మెడికల్ కిట్లు, తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. కొన్ని గ్రామాల్లో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నా చాలా గ్రామాల్లో కనిపించడం లేదు. నీడ సౌకర్యం లేకపోవడంతో కూలీలు చెట్ల కిందనే సేద తీరుతున్నారు. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనేక మంది కూలీలు పని చేసే చోటనే చర్మ సమస్యలు, అలసట, తలనొప్పి వంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కూలీల దాహం తీర్చేందుకు నీటి వసతి కల్పించడం లేదు. కూలీలే ఇంటి నుంచి బాటిళ్లలో తాగునీటిని తెచ్చుకుంటున్నారు. కానీ వారు తెచ్చుకుంటున్న నీరు సరిపోక ఇబ్బంది పడుతున్నారు. ఓఆర్‌ఎస్ ప్యా కెట్లు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు.
రెండు నెలలుగా అందని వేతనాలు
ఉపాధిహామీ కూలీలు మండుటెండల్లో పనులు చేస్తున్నప్పటికీ రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వేతనాలు రాలేవని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉపాధిహామీ పథకంలో పనులు చేసే కూలీలకు పని ప్రదేశంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.


