సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో సమ్మైసెరన్ మోగింది. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ ఆదివారం ప్రకటించారు. కార్మికులు, ఆసాము ల కూలీ పెంపు ఒప్పందం రెండేళ్లకు పైగా జరగడం లేదన్నారు. ఈమేరకు వస్త్రోత్పత్తిదారులకు, అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. శని వారం డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్, చేనేత జౌళి శాఖ ఏడీ సమక్షంలో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో కూలీపోరు తథ్యమని స్పష్టం చేశారు. కోడం రమణ తదితరులున్నారు.
స్వీయ జనగణనలో భాగస్వామ్యం కావాలి
సిరిసిల్లటౌన్: జనగణనలో పౌరులు విధిగా పాల్గొనాలని ఎస్పీ మహేశ్ బీ గీతే, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ కోరారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా మాట్లాడుతూ ఆదివారం నుంచి మే 10 వరకు వెబ్‌సైట్ https://se.census.gov.in లో ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ దార్ల సందీప్ తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు.
ధాన్యం కొనుగోళ్లు షురూ
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎల్.బుచ్చిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 48 కేంద్రాల వద్ద ఆదివారం నాటికి 456 మంది రైతుల నుంచి 2,440.300 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఈసారి కొత్తగా ఆన్‌లైన్ సిస్టం ద్వారా రియల్ టైండేటా ఎంట్రి అమలు చేస్తున్నామని బుచ్చిబాబు వివరించారు. తూకం వేసి ధాన్యం బస్తాలను రైస్‌మిల్లులకు తరలిస్తున్నామని వివరించారు. మిల్లుల్లోనూ ఇబ్బందులు లేకుండా ధాన్యం దిగుమతులు జరుగుతున్నాయని బుచ్చిబాబు తెలిపారు.
రహదారిపై స్పీడ్ బ్రేకర్లు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్‌బంక్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గత ఆదివారం స్థానికులు కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఏఈ అనూజ ఆధ్వర్యంలో సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై జీబ్రా లైన్స్ వేశారు.
ఆలయ అభివృద్ధికి విరాళం
వేములవాడ: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనుల కోసం హైదరాబాద్‌కు చెందిన శంకర్‌రావు–ప్రసూన దంపతులు రూ.10లక్షల విరాళం ఆదివారం అందజేశారు. స్వామివారి ఆశీర్వాదాలు అందజేశారు.


