● ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొసలి కన్నీరు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రైతుల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తే వారు నమ్మే పరిస్థితిలో లేరని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. చందుర్తి మండలం బండపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆదివారం హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి వేస్తే ఉరి అని ప్రచారం చేసిన విషయాన్ని మరిచి.. కేటీఆర్ శనివారం తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి కొనుగోలు కేంద్రంలో రైతులకు వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కార్చడాన్ని విశ్వసించడం లేదన్నారు. పదేళ్ల అధికారంలో కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25 వరకు ప్రారంభించిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. రైతుల మనోధైర్యం దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయన్న సంగతి కేటీఆర్ వైఖరితో బహిర్గతమవుతోందని పేర్కొన్నారు. రైస్‌మిల్లుల్లో స్థలాభావం ఉందని 24 మిల్లుల్లో 1.42 లక్షల టన్నుల, మిగులు ధాన్యం నిలువకు గోదాంలు, అపెరల్ పార్క్ గోదాంలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బండపల్లి, కిష్టంపేట సర్పంచులు కటకం మల్లేశం, మోకనపల్లి దేవరాజం, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, జిల్లా ప్రదాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, డైరెక్టర్లు ఏనుగు లచ్చి రెడ్డి, ఖరీం, నాయకులు ముస్కు మల్లారెడ్డి, డాక్టర్ అజీమ్, ఎండీ అన్వర్, తీపిరెడ్డి కరుణాకర్, పురంశెట్టి శేఖర్, ఉపసర్పంచ్ పల్లపు ఇసాక్ పాల్గొన్నారు.


