● అభివృద్ధి.. సంక్షేమం కనిపించడం లేదా ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం గల వ్యక్తి పార్టీ మారగానే కొత్త పల్లవి అందుకున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి.. సంక్షేమం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ ఆఫీస్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును మీరే తప్పుపడుతూ.. ఇచ్చిన స్టేట్‌మెంట్లు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ అధికారంలో ఉండగా రూ.36వేల కోట్లతో పూర్తి అయ్యే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు పేరు, ఊరు, అంచనాలు మార్చి అప్పులు చేసిన బీఆర్‌ఎస్ పదేళ్ల పాపాల చరిత్రను వదిలిపెట్టి ప్రజాపాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డిని నిందించడానికి నోరెలా వస్తుందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలవుతున్నాయని వివరించారు. ప్రజాపాలన పోవాలని కోరుకుంటున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు జాబితాలో కొత్తగా జీవన్‌రెడ్డి చేరారని ఎద్దేవా చేశారు.
అప్పుల కుప్పను చేశారు
2014 మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని రూ.8లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి నెలకు రూ.6వేల కోట్ల వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితికి తెచ్చిన కేసీఆర్ పా పాల పాలన మళ్లీ రాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఎన్‌డీఎస్‌సీ నివేదిక ఆధారంగా మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అసెంబ్లీకి రాని పెద్దమనిషి గురించి మాట్లాడటం అనవసరమన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ప ట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, పార్టీ నాయకులు ఆడెపు చంద్రకళ, గడ్డం నర్సయ్య, కాముని వనిత, బొప్ప దేవయ్య, కల్లూరి చందన, యెల్లె లక్ష్మీనారాయణ, సూర దేవరాజు, వేముల దామోదర్, బూట్ల నవీన్‌కుమార్, యెల్దండి దేవదాస్ పాల్గొన్నారు.


