ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు ఉద్యోగం లేదు.. డబ్బులు తిరిగివ్వలేదు మోసపోయామని గ్రహించి వేములవాడ పోలీసులకు ఫిర్యాదు
వేములవాడరూరల్: కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై బాధితులు వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్ ఆఫీస్‌లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖలో ఎస్–31లో పనిచేస్తున్న రాజుకుమార్ అనే అధికారి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికారు. అతని మాటలు విశ్వసించి వేములవాడకు చెందిన రాగుల నాగమణి కొడుకు రుమేందర్‌కు మండల పరిషత్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తాననడంతో రూ.1.10లక్షలు ముట్టజెప్పారు. ఈ డబ్బులను 2025 మార్చి 22 నుంచి 2025 జూలై 17 వరకు విడతల వారీగా పంపారు. మరో బాధితుడు ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన మొగ్గం పద్మ కుమారుడు ప్రశాంత్‌కు కూడా ఇలాగే ఉద్యోగం ఇప్పిస్తానంటూ వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతోపాటు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. ఇలా కొన్ని నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. కూలీ పని చేసుకుని బతుకుతున్న తమను మోసం చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. జిల్లాలో వీరే కాకుండా మరికొందరు బాధితులు ఉన్నట్లు సమాచారం. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


