సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పంట పొలాల్లోనే ఉన్న వరిధాన్యం నేలవాలగా.. మామిడికాయలు రాలిపోయాయి. గాలితో కూడిన వర్షం రావడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండు, లోతట్టు ప్రాంతాలైన కార్మికవాడల్లో వరద నీరు పారింది. గాంధీనగర్‌లో గాలివానకు పెంకుటిల్లు పైకప్పు కూలింది. బైపాస్‌రోడ్డు ప్రాంతంలో భారీ వృక్షాలు నేలకూలాయి.
కొట్టుకుపోయిన వడ్లు
తంగళ్లపల్లి: మండల కేంద్రానికి చెందిన దీకొండ అశోక్ పవర్‌లూమ్ కార్ఖాన షెడ్డు గోడ కూలడంతో మిషనరీ ధ్వంసమైంది. దీంతో రూ.6 లక్షల నష్టం వాటిల్లింది. అంకుసాపూర్‌లో ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయాయి. తంగళ్లపల్లిలో మామిడితోటలకు తీవ్రనష్టం జరిగింది. రైతు ఎడమల బాల్‌రెడ్డి తోటలో మామిడికాయలు రాలిపోయాయి.
నేలకొరిగిన వరి పంట
ఇల్లంతకుంట: మండలంలోని రామాజీపేట, ఇల్లంతకుంట గ్రామాల్లో వరిచేనులు నేలకొరిగాయి. ఇల్లంతకుంట, జంగారెడ్డిపల్లె, ముస్కానిపేట, పెద్దలింగాపురం, రామాజీపేట, చిక్కుడువానిపల్లె, రహీంఖాన్‌పేటల్లో వర్షం కురిసింది. రామాజీపేటలోని పెండల కనకయ్య ఇంటిపై చెట్టు విరిగిపడడంతో పెంకుటిల్లు స్వల్పంగా ధ్వంసమైంది. అనంతారం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 23 రోజులవుతున్నా కొనుగోలు చేయలేదని వెలమల మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంతోపాటు రాచర్లబొప్పాపూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి అధికారులు టార్ఫాలిన్ కవర్లను కూడా అందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
రెండు గ్రామాల్లో కురిసిన వర్షం
గంభీరావుపేట: మండలంలోని గజసింగవరం, సముద్రలింగాపూర్ గ్రామాల్లో గురువారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలిన్లతో రక్షించుకున్నారు.
తంగళ్లపల్లిలో కూలిన పవర్‌లూమ్ గోడ
రామాజీపేటలో నేలకొరిగిన వరి చేను


