● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని వల్లంపట్లకు చెందిన వార్డుమెంబర్లు మందాల నరేందర్, కర్ల సులోచన, ఎర్రవెల్లి వెన్నెల, మరొకరు కర్ల అరుణ్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వల్లంపట్ల సర్పంచ్ నేరెళ్ల విజయ్‌గౌడ్, ఏఎంసీ వైస్‌చైర్మన్ ఎలగందుల ప్రసాద్ పాల్గొన్నారు.
స్థల దాతకు సన్మానం
వల్లంపట్లలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి, మహిళా స్వశక్తి భవన నిర్మాణానికి 3 గుంటల స్థలం అందజేసిన మండల గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు కట్ట సౌమ్య శ్రీకాంత్‌రెడ్డిని ఎమ్మెల్యే సన్మానించారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
వేములవాడరూరల్: కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి, మల్లారం, వేములవాడలోని బాలానగర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకా రం సంఘం కొనుగోలు కేంద్రాలను పరిశీ లించారు. మర్రిపల్లిలోని మణికంఠ, మారుతి ఇండస్ట్రీస్, వేములవాడలోని శ్రీరామలింగేశ్వర రైస్‌మిల్లులను తనిఖీ చేశారు.
నేడు ఠాణా భవన పనులకు భూమి పూజ
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలో ఠాణా భవన నిర్మాణానికి శుక్రవా రం చేసే భూమి పూజ ఏర్పాట్లను ఎస్పీ మహే శ్ బీ గీతే గురువారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, ప్రభు త్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతులమీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ శ్రీనివాసులు, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రమేశ్, ఎస్సైలు మోతీరాం, రమేశ్, యాదగిరి, పోలీస్ హౌసింగ్ బోర్డు ఏఈ రాజశేఖర్ పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్స్‌లో 1,206 ర్యాంక్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రానికి సాన రాజు– రజిత దంపతుల కొడుకు రోహిత్ జేఈఈ మెయిన్స్‌లో 1,206 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మిత్ర యూత్ సభ్యులు స్వామిగౌడ్, నేవూరి వెంకట నరసింహారెడ్డి, నాగుల ప్రదీప్‌గౌడ్, నంది నరేశ్, జవ్వాజి సంజీవ్, రాఘవేందర్, బాధ రమేష్, శేషు సన్మానించారు.
డీపీఆర్వోగా ఏడుకొండలు
సిరిసిల్ల: జిల్లా సమాచార, ప్రజాసంబంధాలశాఖ అధికారిగా ఏడుకొండలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జిల్లా ఇన్‌చార్జి డీపీఆర్వోగా పనిచేస్తున్న లక్ష్మణ్ కరీంనగర్ డీపీఆర్వోగా కొనసాగనున్నారు. సంగారెడ్డి డీపీఆర్వోగా పనిచేస్తున్న ఏడుకొండలు జిల్లా డీపీఆర్వోగా విధుల్లో చేరారు. ఆయనకు డీపీఆర్వో ఆఫీస్ సిబ్బంది కవిత, రవి, వెంకటేశ్‌లు స్వాగతం పలికారు.
ఎన్యుమరేటర్లకు జీతభత్యాలు ఇవ్వాలి
సిరిసిల్ల: ప్రభుత్వం 2024లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని, ఆ సర్వే చేసిన ఎన్యుమరేటర్లకు ఇప్పటి వరకు జీతభత్యాలు ఇవ్వలేదని ఓయూ విద్యార్థి నాయకుడు, అడ్వకేట్ రజనీకాంత్ గురువారం తెలిపారు. జిల్లాలో రూ.1.50కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా రూ.150 కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేలు రావాల్సి ఉందని తెలిపారు.


