రెండో రోజు.. నిరసనల జోరు | - | Sakshi
Sakshi News home page

రెండో రోజు.. నిరసనల జోరు

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు

సంఘీభావం తెలిపిన కార్మిక, రాజకీయ పార్టీలు

సిరిసిల్లటౌన్‌/వేములవాడఅర్బన్‌: సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు చేపట్టిన సమ్మె రెండో రోజు గురువారం కొనసాగింది. తెల్లవారుజామునే కార్మిక సంఘాలు సిరిసిల్లడిపోతోపాటు కొత్తబస్టాండ్‌, పాత బస్టాండ్‌, వేములవాడ బస్టాండ్‌ ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. టీఎస్‌ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు సీహెచ్‌.బాణయ్య, ఉపాధ్యక్షులు జే.ఎస్‌.ఎన్‌.రావు, శ్రీనివాస్‌నాయక్‌, ప్రశాంత్‌, సుమలత, రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

రాజకీయ పార్టీల సంఘీభావం

సిరిసిల్ల కొత్త బస్టాండులో ఆర్టీసీ జేఏసీ కార్మికుల నిరసన దీక్ష శిబిరంలో మద్దతు ప్రకటించారు. బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఎనగందుల వెంకన్న, సీపీఎం నేతలు కోడం రమణ, అన్నల్‌దాస్‌ గణేశ్‌, సీపీఐ నాయకులు గుంటి వేణు, కడారి రాములు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ సంఘీభావం పలికారు.

ప్రజల ఇబ్బందులు గమనించండి

ఆర్టీసి జేఏసీ చేపడుతున్న నిరవధిక సమ్మెతో ప్రజలు పడుతున్న కష్టాలను కార్మికులు గమనించాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ కోరారు. జేఏసీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. కార్మికుల 32 డిమాండ్లలో 29 నెరవేర్చడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. కార్మికులు సమ్మె విరమిస్తే.. కాంగ్రెస్‌ సర్కారు కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులున్నారు.

డిమాండ్లు నెరవేర్చాలి

గౌరవ అధ్యక్షుడు పిప్పరి రాజయ్య, జేఏసీ చైర్మన్‌ జీపీ సింగ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. డిపోలోని కంట్రోలర్లు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతూ తెలిపారు. శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, లక్ష్మన్‌, ప్రవీన్‌, తదితరులు ఉన్నారు.

బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు

భీమన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయణంలో బస్సులు లేకపోవడంతో బస్టాండ్‌లో పడిగాపులు కాశారు. ఆలస్యంగా ప్రవేటు అద్దె బస్సులు రావడంతో సీట్ల కోసం పరుగులు తీశారు. వేములవాడ డిపో నుంచి గురువారం 23 ప్రైవేటు అద్దె బస్సులు, 8 ఆర్టీసీ బస్సులు నడిచినట్లు డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

వేములవాడ బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు

సిరిసిల్ల డిపో ఎదుట ఆర్టీసీ నేతల గేట్‌ ధర్నా

Advertisement
 
Advertisement
Advertisement