● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి(చొప్పదండి): రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి, తడగొండల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. తహసీల్దార్ షరీఫ్ మొయినొద్దీన్, ఎంఏవో ప్రణిత, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్‌రెడ్డి ఉన్నారు.
దళారులకు ధాన్యం అమ్ముకోవద్దు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బుచ్చి బాబు, ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేర బేగం, సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య కోరారు. ఎల్లారెడ్డిపేట సింగిల్‌విండో ఆధ్వర్యంలో నారాయణపూర్, వెంకటాపూర్ రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. డీఎంఎస్ నరసింహ, ఏఎంసీ వైస్‌చైర్మన్ గుండాడి రాంరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ షఫీయొద్దీన్, ఉపసర్పంచ్‌లు మోతె మధుసూదన్‌రెడ్డి, గొట్టె శ్రీకాంత్, సెక్రెటరీ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వాంటెడ్ డ్రైవర్స్..కండక్టర్స్
సిరిసిల్లటౌన్/వేములవాడ అర్బన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ డిపోలలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్‌గా పనిచేయుటకు ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎం ప్రకాశ్‌రావు తెలిపారు. డ్రైవర్‌కు హెవీ లైసెన్స్‌తో 18 నెలల అనుభవం ఉండాలని, ఒరిజినల్ లైసెన్స్, ఆధార్‌కార్డు, 2 ఫొటోలు, కండక్టర్‌కు ఎస్సెస్సీ ఉత్తీర్ణులై, ఒరిజినల్ మెమో, ఆధార్‌కార్డు, 2 ఫొటోలతో సిరిసిల్ల బస్సు డిపోలో సంప్రదించాలని కోరారు. డ్రైవర్‌కు రోజుకు రూ.1000, కండక్టర్‌కు రోజుకు రూ.800 వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99592 25929, 86868 69005, 81783 71273 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
స్వీయ జనగణనలో పాల్గొనాలి
సిరిసిల్లటౌన్: జనగణన–2027 స్వీయ ఎన్యూమరేషన్‌లో సిరిసిల్ల పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ ఎం.ఏ.ఖదీర్‌పాషా కోరారు. ఈమేరకు బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ జనగణన అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సౌకర్యం ద్వారా ప్రతీ కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకింగ్, ఐటీరంగ ఉద్యోగులు, కాలనీ సంక్షేమ సంఘాలు పాల్గొనాలని కోరారు. htt ps://se.census.gov.in వెబ్ పోర్టల్‌ను సందర్శించి కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.
మేలో సదరం శిబిరాలు
సిరిసిల్ల: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మే నెలలో నిర్వహించే సదరం శిబిరాల తేదీలను ఖరారు చేసినట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్ బుధవారం తెలిపారు. మే 2, 4, 5 ఆర్థోపెడిక్, 5, 6 వినికిడి(చెవుడు), 6న మానసిక దివ్యాంగులకు, 7, 12న కంటిచూపు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. మే 13న జనరల్ వైద్యపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.


