ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా ! | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా !

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

● లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ● ఎవరినీ నమ్మొద్దంటూ ప్రభుత్వ విప్‌ కరపత్రం విడుదల

● లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ● ఎవరినీ నమ్మొద్దంటూ ప్రభుత్వ విప్‌ కరపత్రం విడుదల

వేములవాడ/వేములవాడరూరల్‌: కలెక్టరేట్‌లో పనిచేసే ఓ అధికారి కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసుకొని, కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగాల విషయమై సదరు ఉద్యోగిని నిరుద్యోగులు నిలదీస్తే రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సదరు ఉద్యోగిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. కలెక్టర్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ అధికారి కలెక్టరేట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశాడు. అతని బాధితులు వేములవాడతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఏడాదికాలంగా ఉద్యోగాలు ఇప్పించకపోగా తప్పించుకు తిరుగుతుండడంతో సదరు ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు.

డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి

నియోజకవర్గంలో కొందరు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని తన పేరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈమేరకు బుధవారం ఓ కరపత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. రాజన్నగుడి, కలెక్టర్‌ కార్యాలయం, మున్సిపల్‌ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే నమ్మొద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement